
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
కడప కోటిరెడ్డిసర్కిల్: భూ సమస్యల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన ఫిర్యాదుల పెండెన్సీపై ఆమె డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, చిన్నయ్య, సర్వే ల్యాండ్స్ ఏడీ మురళీ కృష్ణతో కలిసి సీఎంవో కార్యాలయం నుంచి అందిన కాల్స్ మేరకు ఆయా డివిజన్ల ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఆర్‌ఐలు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్‌ఎస్ వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవలు, రెవెన్యూ అంశాలు, పీవోటీ యాక్ట్ ప్రకారం అసైన్డ్ భూముల పరిష్కారంలో ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని, వచ్చిన ఫిర్యాదులకు సరైన పరిష్కార నివేదికలు అందడం లేదన్నారు. అనంతరం ఆయా శాఖల వారీగా ఫిర్యాదుల పెండింగ్‌పై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఉల్లి కొనుగోలుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు
జిల్లాలో పండించిన ఉల్లి పంటను రైతులకు నష్టం వాటిల్లకుండా ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతోందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి పంట కొనుగోలుకు సంబంధించి జిల్లాలోని ఉల్లి రైతులు, ట్రేడర్లతో ఆమె సమావేశం ఏర్పాటు చేసి, వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఇన్‌చార్జి కలెక్టరు మాట్లాడుతూ ఇప్పటికే ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంత ఉల్లి రైతులు సద్వినియోగం చేసుకునేందుకు అన్ని రకాల సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర బాబు, జిల్లా మార్క్ ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి, మార్కెటింగ్ ఏడీ ఆజాద్ వలి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అదితి సింగ్