
బతికుండగానే చంపేశారు
● రూ.2కోట్లు విలువైన ప్రభుత్వ ఉద్యోగి స్థలాన్ని డెత్ సర్టిఫికెట్‌తో అమ్మేశారు
● ఎన్జీఓ ప్లాట్ 300కు సంబంధించి వెలుగుచూసిన సంఘటన
ప్రొద్దుటూరు : బతికుండగానే ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినట్లు ఏకంగా డెత్ సర్టిఫికెట్‌ను సృష్టించి రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని మరొకరికి అమ్మారు. ప్రభుత్వ ఉద్యోగి వీఆర్‌ఎస్ పొంది ప్రతినెలా పెన్షన్ తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఈ సంఘటనను తెలుసుకుని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. సంఘటన ఎవరు చేశారు.. ఎలా జరిగింది... ఎవరెవరి హస్తం ఉంది అనే వివరాల గురించి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఆరా తీయలేదు. వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 1980 ప్రాంతంలో ఎన్జీఓ ప్లాట్లు వేశారు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.కోట్లు పలుకుతోంది. ఈ కాలనీలోనే గంజికుంట సుబ్బరాయుడు (నీటి పారుదల శాఖ రిటైర్డు ఎస్‌ఈ)కు 1986లో సర్వే నంబర్ 194, 196లోని ప్లాట్ నంబర్ 300లోని 7.5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆయన గత 40 ఏళ్లుగా తన స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
డెత్ సర్టిఫికెట్ సృష్టించి...
గంజికుంట సుబ్బరాయుడు నీటి పారుదల శాఖలో ఎస్‌ఈగా పనిచేసి 2003లో వీఆర్‌ఎస్ పొంది ప్రభుత్వం నుండి ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి పెన్షన్ పొందుతున్నారు. గంజికుంట సుబ్బరాయుడు, తన భార్య గంజికుంట వెంకటసుబ్బమ్మ ప్రొద్దుటూరు పట్టణంలోని బుడ్డాయపల్లెలో నివాసం ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఉన్న (ఆధార్ కార్డు 994947290378) వివరాలతో గంజికుంట సుబ్రహ్మణ్యం ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాన్ని కొండాపురం మండలం దత్తాపురం గ్రామానికి చెందిన వద్ది నారాయణ కుమారుడు నాగరాజు (ఆధార్ కార్డు నంబర్ 879824061289)కు రిజిస్టర్ చేయించారు. తన తండ్రి గంజికుంట సుబ్బరాయుడుతోపాటు తల్లి గంజికుంట లక్ష్మీదేవి మరణించినట్లు ఏకంగా మున్సిపాలిటీ నుంచి డెత్ సర్టిఫికెట్లు తీసుకుని జత చేశారు. వాస్తవానికి గంజికుంట సుబ్బరాయుడుకు గంజికుంట సుబ్రహ్మణ్యంకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరో వీరికి తెలియదు, ఎలాంటి సంబంధాలు లేవు. ఈ ఏడాది ఆగస్టు 13న ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రిజిస్టర్ జరిగింది. స్టాంప్ రైటర్ తొండలదిన్నె శ్రీనివాసులు ఈ డాక్యుమెంట్‌ను తయారు చేయగా, దొరసానిపల్లెకు చెందిన వరద ఆంజనేయులు, డ్రైవర్ కొట్టాలకు చెందిన నల్లు జయశంకర్ సాక్షులుగా ఉన్నారు. తనకు జరిగిన మోసాన్ని తెలుసుకున్న గంజికుంట సుబ్బరాయుడు కొద్ది రోజుల క్రితం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఈ విషయంపై శుక్రవారం సాయంత్రం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ జీఎన్‌జీ రామదాసును సాక్షి వివరణ కోరగా ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు తనకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు.
బతికుండగానే గంజికుంట సుబ్బరాయుడు
మరణ ధృవీకరణ పత్రం
గంజికుంట సుబ్బరాయుడు స్థలాన్ని
రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు
ప్రభుత్వ ఉద్యోగి స్థలాన్ని
అమ్మిన వారు, కొన్నవారు

బతికుండగానే చంపేశారు

బతికుండగానే చంపేశారు