
బాబు పాలనలో సంక్షోభంలో వ్యవసాయం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు.ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను నిరోధించి రైతులందరికి యూరియా సరఫరా చేయాలని కోరుతూ ఈనెల 9న ఉదయం 10 గంటలకు అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో శనివారం అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగ చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే వ్యవసాయాన్ని దండగగా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబుకు తొలి నుంచి రైతులపై ప్రేమ లేని కారణంగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారన్నారు. యూరియా కోసం వెళ్లిన రైతులపై గతంలో లాఠీ చార్జి చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు.
జగన్ ప్రభుత్వంలో కొరత లేదు
వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులకు సమస్యలు లేవని రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలను అందించడంతోపాటు శాస్త్రవేత్తల ద్వారా సలహాలు కూడా ఇచ్చేవారన్నారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారిందన్నారు. సరైన ప్రోత్సాహం లేని కారణంగా ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలులో వేయాలని చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేస్తోందన్నారు. ఎంత మందిని ఎంత కాలం జైళ్లలో పెడతారని రాచమల్లు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, లావణ్య, జయంతి, రాగుల శాంతి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, చింపిరి అనిల్ కుమార్, రైతు నాయకులు టంగుటూరు విశ్వనాథరెడ్డి, శంకరాపురం మల్లికార్జునరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మల్లికార్జున ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.