
హెచ్‌ఐవీపై యువతకు అవగాహన అవసరం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు
కడప రూరల్ : హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి పట్ల నేటి యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2025–26లో భాగంగా శనివారం 5కే రెడ్ రన్ మారథాన్ నిర్వహించారు. కొత్త కలెక్టరేట్ రోడ్డు నుంచి రిమ్స్ బ్రిడ్జి వరకు కొనసాగిన ఈ మారథాన్ యూ టర్న్ తీసుకుని తిరిగి మహావీర్ సర్కిల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ హెచ్‌ఐవీ అంటు వ్యాధి కాదని తెలుసుకోవాలన్నారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్షను విడనాడాలన్నారు. ఇదే క్రమంలో యువత హెచ్‌ఐవీ బారిన పడి బంగారు భవిష్యత్తులను చేజేతులా కోల్పోవద్దని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్–టీబీ ఽఅధికారి డాక్టర్ యస్.రవి బాబు మాట్లాడుతూ హెచ్‌ఐవీ /ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని వారి పట్ల ప్రేమ, అభిమానాలు కలిగి ఉండాలని తెలియజేశారు. క్లస్టర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ భాస్కర్ వేంపల్లె మాట్లాడుతూ హెచ్‌ఐవీ ఎయిడ్స్ కి చికిత్స ఉందన్నారు. దీనిపై అనుమానాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. అలాగే హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తులు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత మందులు తీసుకోవాలని తెలిపారు . ఈ 5కే రెడ్ రన్ మారథాన్‌లో అబ్బాయిల విభాగంలో మొదటి బహుమతి ఎ. సింహాచలం (గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్, కడప), రెండవ బహుమతి ఈ. సికిందర్ (గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్, కడప) గెలుచుకున్నారు. అలాగే యువతుల విభాగంలో మొదటి బహుమతి శ్రీశ (గవర్నమెంట్ పాలిటెక్నిక్ విమెన్ కాలేజీ, కడప), రెండవ బహుమతి కీర్తి (గంగాభవాని కాలేజీ) గెలుపొందారు. ట్రాన్స్ జెండర్స్ విభాగంలో మొదటి బహుమతి పింకి (యస్‌బీఆర్‌టీఎం కాలేజ్, కడప), రెండవ బహుమతి ఇ. మహేష్ (ఎస్వీ డీసీ కాలేజీ, కడప) గెలుపొందారు. జిల్లా క్రీడల అధికారి జగన్నాథ్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గురవయ్య, స్టెప్ మేనేజర్ సుబ్బరాయుడు, స్టాటిస్టికల్ ఆఫీసర్ రమేష్‌రెడ్డి, అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటరెడ్డి, కోచ్‌లు అమృత్‌రాజ్, కల్యాణ్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.