
అత్యాచారం కేసులో వ్యక్తి అరెస్టు
వేముల : మైనర్ బాలిక అత్యాచారం కేసులో కుంచపు వెంకటరమణ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ ఉలసయ్య, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌లు తెలిపారు. వేముల పోలీస్ స్టేషన్‌లో శనివారం వారు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వేముల గ్రామానికి చెందిన కుంచపు వెంకటరమణ 2021లో స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండేవాడు. మధ్యలో చదువు ఆపేసి అప్పటి నుండి బేల్దారి పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో గత నాలుగు నెలల నుండి వేముల గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గతనెల 30వ తేదీ బాలికను బలవంతంగా మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కుంచపు వెంకటరమణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు వారు తెలిపారు.