
టపాసులు పేలి గాయపడిన వ్యక్తి మృతి
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని రేకలకుంట పంచాయతీ బాగాదుపల్లెలో గత శుక్రవారం వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ఊరేగింపులో ప్రమాదవశాత్తు టపాసులు పేలి కుమ్మితి పాలకొండయ్య (35)కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హుటాహుటిన బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు కడప రిమ్స్‌కు తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ఓ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా గత వారం రోజులు గా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. తమను ప్రభుత్వం ఆదుకోవాలని మృతుడి భార్య పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మతిస్థిమితం లేని మహిళ భర్తకు అప్పగింత
కలసపాడు : మండలంలోని తెల్లపాడు గ్రామంలో గురువారం రాత్రి మతిస్థిమితం లేని మహిళ తిరుగుతుండగా స్థానికులు గుర్తించి 112కు సమాచారమిచ్చారు. దీంతో నైట్‌డ్యూటీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను విచారించగా తన పేరు ఉప్పరపురమాదేవి అని, చాపాడు మండలం ఎన్.ఓబాయపల్లె గ్రామానికి చెందినదిగా పోలీసులకు తెలిపింది. వెంటనే పోలీసులు ఆమె భర్త యేసోబుకు సమాచారం అందించి స్టేషన్‌కు పిలిపించి రమాదేవిని ఆమె భర్తకు అప్పగించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్, పోలీసులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాయచోటి టౌన్ : రోడ్డు ప్రమాదంలో మురికినాటి రాజారెడ్డి (75) అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాఫిక్ ఎస్‌ఐ కుళాయప్ప కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం చెన్నముక్కపల్లె నుంచి తన పొలానికి స్కూటీపై రాజారెడ్డి వెళ్తుండగా కడప వైపు నుంచి మదనపల్లె రోడ్డు వైపు వస్తున్న ఏపీ39 యుఎస్ 9908 నంబర్ గల కారు ఢీకొంది. రాజారెడ్డి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి కుమారుడు గంగిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.