
లోకేష్ వ్యాఖ్యలు నీచరాజకీయాలకు పరాకాష్ట
కడప కార్పొరేషన్ : రాష్ట్ర విద్య, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు నీచరాజయాలకు పరాకాష్ట అని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజు తన తల్లి విజయమ్మను వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పలకరించలేదని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించడం విష ప్రచారానికి పరాకాష్ట అన్నారు. విషం చిమ్మడంలో లోకేష్ గోబెల్స్‌నే మించిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ వర్ధంతి రోజు తాను విజయమ్మ పక్కనే ఉన్నానని, వైఎస్ విజయమ్మను జగన్ అప్యాయంగా పలకరించడం అందరూ చూశారని, ఆ దృశ్యాలు అన్ని టీవీల్లోనూ ప్రసారం అయ్యాయన్నారు. కళ్లుండి లోకేష్ చూడలేకపోవడం దురదృష్టకరమన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకున్నామని టీడీపీ ఓటర్లు చెప్పడం ఎంత అబద్ధమో, వైఎస్ జగన్‌ను కలిసేందుకు పాసులు ఇచ్చారని లోకేష్ విషం చిమ్మడం కూడా అంతే అబద్ధమన్నారు. మీ చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారో లోకేష్ సమాధానం చెప్పాలని రెడ్యం సవాల్ విసిరారు. నాడు వ్యవసాయం దండగ అన్న నారా చంద్రబాబు నాయుడు నేడు యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వరి ఎక్కువ పండిస్తే కొనే వారే ఉండరని చెప్పడం రైతు వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు లేని వాటిని నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమవుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి వై.నిరంజన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బి. సుబ్బరాయుడు యాదవ్ పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
ఆర్.వెంకటసుబ్బారెడ్డి