
టీడీపీకి అండగా ఉన్న బలిజలకే మోసం
● పెత్తనమంతా ఒక సామాజిక వర్గానిదే
● టీడీపీపై బలిజ సంక్షేమ సంఘం నేతల ఆగ్రహం
కడప రూరల్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బలిజ వర్గీయులను అవమానపరచడం తగదని బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. గురువారం స్థానిక హరి టవర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 27 శాతం మంది బలిజ వర్గీయులు ఉన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తామంతా అండగా నిలిచామన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడానికి బలిజలు కృషి చేశారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక బలిజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. జిల్లాలో పార్టీ కోసం పని చేసిన హరిప్రసాద్‌కు నామమాత్రంగా డైరెక్టర్ పదవిని ఇచ్చి బలిజలను అవమానపరిచారని తెలిపారు. బలిజలకు టీడీపీ ఎందుకు గుర్తింపు ఇవ్వలేదో అధిష్టానానికే ఎరుక అని పేర్కొన్నారు. రాయలసీమ బలిజ సంఘం నాయకులు చెన్నంశెట్టి మురళి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పెత్తనమంతా ఒక సామాజిక వర్గానిదే సాగుతోందన్నారు. బలిజలకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బలిజ భవన్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. టీడీపీ సిద్ధాంతం కోసం మా వాళ్లంతా కష్టపడితే, ఆ పార్టీ అధిష్టానం తమకు ఏ మాత్రం న్యాయం చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.