
రీసర్వే పక్కాగా నిర్వహించాలి
కడప సెవెన్ రోడ్స్: జిల్లాలో భూ రీసర్వేను పక్కాగా నిర్వహించాలని మండల, గ్రామస్థాయిలో తహసిల్దార్లు సర్వేయర్లు, వీఆర్వోలను ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. బుధవారం భూముల రీ సర్వే, రెవెన్యూ అంశాలపై అదనపు సీసీఎల్‌ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నక్కల ప్రభాకర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఇంచార్జి కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలు ఎక్కడా పెండింగ్ లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ఫేజ్ 1 లో ఉన్న భూముల రీసర్వే వేగవంతంగా, పకడ్బందీగా ఈ నెలాఖరు లోపల పూర్తి చేయాలన్నారు. భూముల రీసర్వే లో రెవెన్యూ, సర్వే ల్యాండ్ శాఖల అధికారులు నేరుగా రైతుల వద్దకే వెళ్లి క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తప్పనిసరిగా వ్యవసాయ అధికారులు ఆధార్ అప్డేషన్ చేయాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, సర్వే ల్యాండ్ అధికారి మురళీకష్ణ,జిల్లా వ్యవసాయ శాఖ జేడి చంద్రా నాయక్,రెవెన్యూ అధికారులు, సర్వే ల్యాండ్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సేవల్లో వేగం పెరగాలి
ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం వీడి పనితీరు మెరుగుపరచుకొని జవాబుదారీతనంతో పనిచేయాలని ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో వీఆర్వోలు, సచివాలయ అడ్మిన్స్, వెల్ఫేర్ సెక్రటరీలు,మండల గ్రామ సర్వేయర్ల తో ఐవీఆర్‌ఎస్ లో వచ్చిన ఫీడ్ బ్యాక్ నివేదికల పనితీరు పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలతో కలిసి మెలిసి మమేకం కావాలని, చట్ట ప్రకారం ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పని చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అందజేత, అర్జీలు పరిష్కారం చూపడంలో తీవ్ర జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐవీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్ నివేదికలలో పనితీరు మెరుగ్గా లేని అధికారులపై తహసీల్దార్లు విచారణ పూర్తి చేసి రిపోర్ట్ అందజేయాలని ఆదేశించారు
ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్