క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి | - | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి

Jul 15 2025 6:37 AM | Updated on Jul 15 2025 6:37 AM

క్షతగ

క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి

మృతులు చెంచమ్మ(54), చిట్టమ్మ(30), వి. శ్రీను(28), గజ్జలగంగమ్మ(33), గజ్జలదుర్గయ్య(37), ముని చంద్ర(26), రాధమ్మ (31), జానీ (15), సుబ్బరత్నమ్మ (31) (ఫైల్‌)

సాక్షి రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్‌ : అమాయక గిరిజనులు...పొట్టకూటి కోసం.. రోజువారి కూలీ కోసం ఊరుగాని ఊరొచ్చారు. ఎంతోకొంత సంపాదించుకోవచ్చని ఆశపడ్డారు. ఆ ఆశలపై విధి చిన్నచూపు చూసింది. ప్రమాదమై దూసుకొచ్చి విషాదగీతిక రాసింది. రాజంపేట–రైల్వేకోడూరు మధ్యలోని పుల్లంపేట మండలం రెడ్డివారిపల్లె చెరువుకట్టపై జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. జీవితానికి సరిపడా చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది.

వారి వేదన...అరణ్య రోదన

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శెట్టిగుంట యానాదుల కాలనీలో బాధిత కూలీల కుటుంబాల రోదన అరణ్య వేదనగా మారింది. ఓ వైపు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే...తెల్లవారిన అనంతరం మృతదేహాల వద్దకు వారు వచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా బంధువులే. ఒకరునొకరు వరుసకు సోదరుడు, బావమరిది, చిన్నమ్మ, భర్త ఇలా... ఒకరినొకరితో బంధుత్వాలు కలిగి ఉన్నారు. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి బంధువుల ఆవేదన వర్ణణాతీతంగా మారింది. రాజంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద వివరాల కోసం సమాచారం అడుగుతున్నా చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోయారు.

కాలనీలో కన్నీటి ఘోష

రైల్వేకోడూరు పరిధిలోని యానాదుల కాలనీలో కన్నీటి ఘోష కనిపిస్తోంది. కాలనీకి చెందిన 9 మంది మృతి చెందడం, మరో 13 మందికి గాయాలు కావడంతో ఆ ప్రాంతమంతా తల్లడిల్లిపోయింది. కొద్దిసేపట్లో గమ్య స్థానానికి చేరుకుంటారని అనుకుంటున్న తరుణంలోనే ఇలా ఒక్కసారిగా ఉపద్రవం ముంచుకొచ్చిందంటూ తలుచుకుని కన్నీటిపర్యంతమవుతున్నారు.

పొట్టకూటికోసం వచ్చి....

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శెట్టిగుంట ఎస్టీ కాలనీలోకి కొంతమంది యానాదులు పనుల కోసం వలస వచ్చారు. ప్రధానంగా వెంకటగిరి, రేణిగుంట పరిధిలోని రెండు గ్రామాలకు చెందిన సుమారు 20–30 కుటుంబాలు పనుల కోసం వచ్చాయి. పొట్టకూటికోసం ఎక్కడో దూర ప్రాంతాల నుంచి పనుల కోసం వలసవచ్చి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడిన వారిని రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఇతరవైఎస్సార్‌ సీపీ నాయకులు పరామర్శించారు. మార్చురీ వద్ద మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ఇంత పెద్ద ఘటన జరగడం బాధాకరమని, వెంటనే ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇంతవరకు ప్రభుత్వం పరిహారం ప్రకటించకపోవడంపై మండిపడ్డారు. వెంటనే ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.

అతివేగమే ప్రాణం తీసిందా

రెడ్డిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతి వేగం ప్రాణం తీసిందని తెలుస్తోంది. దీనికి తోడు కూలీలను తీసుకెళ్లే మేసీ్త్ర, వ్యాపారులు పని చేయించుకొని వారిని వదిలేశారు. వారి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేయకుండా రాత్రి వేలలో నిబంధనలకు విరుద్ధంగా అంత మందిని లోడ్‌ పైన ఎక్కించి ప్రయాణం చేయించడంపై బాధితుల బంధువులు మండిపడుతున్నారు.

అనాథలైన పిల్లలు

గజ్జల గంగమ్మ, దుర్గయ్యలు ప్రమాదంలో మృతి చెందడంతో వారిపిల్లలు సునీతమ్మ, రాజీ, గంగయ్యలు అనాథలయ్యారు. మృతదేహాలవద్ద వారి తాత పిల్లలను ఓదార్చలేక పోయాడు.

ఒకే చోట అంత్యక్రియలు

ఆఊరికి ఎప్పుడూ లేనంత కష్టం వచ్చింది. ఒకేమారు నలుగురు మృతి చెందడం మృతదేహాలను ఖననం చేయడానికి గుంతలు తీయడానికి సమయం సరిపోలేదు. దీంతో జేసీబీతో గుంతలు తవ్వి ఖననం చేశారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

రాజంపేట : పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలకు ఇలా జరగడం చాలా బాధకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తునన్నారు. హాస్పిటల్‌ చికిత్స పొందుతున్న త్వరగా కోలుకోనే విధంగా వైద్య సేవలందించాల న్నారు.

కన్నీటిలో శెట్టిగుంట ఎస్టీ కాలనీ

ఎవరిని కదిపినా కన్నీరే

రాజంపేట హాస్పిటల్‌లో

పూర్తయిన పోస్టుమార్టం

రాజంపేట : రెడ్డిపల్లె చెరువుపై ఆదివారం లారీబోల్తా సంఘటనలో క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జనార్ధన్‌రెడ్డి అన్నారు. రాజంపేట ప్రాంతీయవైద్యశాలలో ఉన్న క్షతగాత్రులను కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జరిగిన ప్రమాదసంఘటనపై సీఎంతో మాట్లాడనన్నారు. సీఎం సూచన మేరకు క్షతగాత్రులను పరామర్శించామన్నారు. బాధితు కుటుంబాలను ఏవిధంగా ఆదుకోవాలనే విషయం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి నిర్ణయం తీసుకుంటామన్నారు. కలెక్టరు శ్రీధర్‌ చామకూరి మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు.రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి ముక్కారూపానందరెడ్డి, టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమరి జగన్‌మోహన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి 1
1/1

క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement