
రైలు గడువు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్ : తిరుపతి–చర్లపల్లి–తిరుపతి మధ్య నడుస్తున్న రైలును ఆగస్టు 30వ తేదీ వరకు పొడిగించినట్లు రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. (07011) చర్లపల్లి–తిరుపతి మధ్య ప్రతి శుక్ర, ఆదివారాల్లో.. (07018) తిరుపతి–చర్లపల్లి మధ్య ప్రతి సోమ, శనివారాల్లో నడుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇంటర్ ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం
కడప రూరల్ : ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థుల ఖాతాలకు తల్లికి వందనం నిధులు మంజూరవుతాయని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి కె.సరస్వతి తెలిపారు. జిల్లాలో 1,896 మంది ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థులు వెంటనే సమీపంలోని పోస్టాఫీసులో ఖాతానుతెరిచి మీ ఆధార్ నెంబరుకు, ఎన్‌పీసీఐ పోర్టల్‌కు లింక్ చేసుకోవాలన్నారు. ఒకవేళ విద్యార్థికి ఇదివరకే బ్యాంకు అకౌంటు ఉన్నట్లయితే ఆ అకౌంటుకు ఎన్‌పీసీఐ లింక్ చేయించాలని తెలిపారు. మీ ఖాతాకు ఎన్‌పీసీఐ లింకు అవడం వల్ల తల్లికి వందనం పథకం డబ్బులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జమ అవుతాయని తెలిపారు.
ఫ్రైడే డ్రైడేతో
ఆరోగ్యకర వాతావరణం
కడప రూరల్ : ఫ్రైడే డ్రైడే కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని జిల్లా మలేరియా అధికారి మనోరమ తెలిపారు. శుక్రవారం స్థానిక బుడ్డాయల్లెలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా, డెంగీ జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. వారానికి ఒకసారి ఇళ్లల్లోని తొట్లు, కుండలు, బానలు, కూలర్లు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. డెంగీ, మలేరియా జ్వరాలకు సంబంధించిన రక్త పరీక్షలు రిమ్స్, మీ సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రైడే డ్రైడే కార్యక్రమం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనడంతో మెరుగైన ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటరెడ్డి, సబ్ యూనిట్ అధికారి నాగలక్ష్మిరెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి శంకర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
జాతీయస్ధాయి
క్రీడలకు ఎంపిక
రాజంపేట : జాతీయస్ధాయి క్రీడలకు కేంద్రీయ విద్యాలయం విద్యార్ధులు ఎంపికయ్యారని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ మురగేశన్ శుక్రవారం తెలిపారు. కోచ్ రాహుల్ కుమార్, సహాయకోచ్ కుమారజరపాలా వీరికి శిక్షణ ఇచ్చారన్నారు.ఎంపికై న వారిలో మోక్షిత్(చెస్), హర్ష(టేక్వాండో), కార్తీక్, మహేశ్ (కబడ్డీ), ఉదయశంకర్ (డిస్కస్‌త్రో) ఉన్నారని చెప్పారు. జిల్లాస్థాయి క్రీడలకు అండర్–14 విభాగంలో నాగలక్షీప్రియ, హరిత, అండర్–17లో హర్షిత, రిషి, గాయత్రి, అండర్ –19లో మోహనావైష్ణవి, యశస్విని ఎంపికయ్యారన్నారు. విద్యార్ధులను ప్రిన్సిపాల్ మురగేశన్ అభినందించారు.
రైళ్లలో ఆకస్మిక తనిఖీలు
రాజంపేట : జిల్లాలో నడిచే పలు రైళ్లలో శుక్రవారం పోలీసులు, రైల్వేపోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాల మేరకు తనిఖీలు జరిగాయి. చైన్నె–ముంబై మధ్య నడిచే సూపర్‌ఫాస్ట్ రైళ్ల బోగీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి,మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమరవాణా అరికట్టేందుకు తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్‌పై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు, 112కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.
డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లాలోని మదనపల్లె మండలం వలసపల్లి గ్రామం, రాజంపేట మండలం నరమరాజుపల్లి గ్రామాల్లో ఉన్న శ్రీ జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం డిసెంబర్ 13వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈవిషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన 2025–26 విద్యా సంవత్సరం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.