
వెనుకబడిన ప్రాంతాలపై నిర్లక్ష్యం వద్దు
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో అభివృద్ధి అంటూ... వెనుక బడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం తగదని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కమిటీ సమావేశం కడప ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో నారాయణ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. మహానాడు వేదికగా ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు.
నెల రోజుల్లో కడప ఉక్కు పరిశ్రమ పనులు జరుగుతాయని చెప్పిన ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర సంపాదనంతా రాజధాని పేరుతో ఖర్చుపెడితే మిగతా ప్రాంతాల అభివృద్ధి ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగాక రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోరుతూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, ఎన్‌వీ.రమణ, మాలకొండయ్య, శివయ్య, సీఆర్వీ ప్రసాద్, గుర్రప్ప, అంజి, రవిశంకర్‌రెడ్డి, జయవర్ధన్, ప్రభాకర్‌రెడ్డి, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక
రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ