
ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, వెండి చోరీ
ఖాజీపేట : ఖాజీపేట పోలీస్ స్టేషన్ సమీపంలోనే శుక్రవారం చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. ఖాజీపేట మహిళా మార్టు ప్రక్కన నివాసముంటున్న వీఎన్.అమితాబ్ గురువారం రాత్రి తన ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం అమితాబ్ ఇంటి ముందు తన ఫొటో స్టూడియో తెరిచేందుకు వచ్చిన సిద్ధిక్ వెనుకభాగం వాకిలి పగిలి ఉడడం గమనించాడు. లోపలికి వెళ్లి పరిశీలించి చోరీ జరిగిన విషయం యజమాని అమితాబ్‌కు సమాచారం ఇచ్చారు. నాలుగు బీరువాలు పగుల కొట్టి దుస్తులు చెల్లా చెదురుగా పడేసినట్లు గమనించిన అమితాబ్ ఖాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.20 వేల నగదు, వెండి వస్తువులు దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. బంగారు ఆభరణాలు తమ వెంట తీసుకుని పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు ఎదురుగా మహిళా మార్టు సీసీ కెమేరాలు పరిశీలిస్తున్నారు.