
భర్త మూడో పెళ్లికి యత్నం.. మొదటి భార్య ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : ఆ వ్యక్తికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఆరుగురు సంతానం కూడా ఉన్నారు. అయినా ఆయన మూడవ పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన మొదటి భార్య కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి బద్వేలులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని సుమిత్రానగర్ (ఎరుకలవీధి)కు చెందిన జగన్నాధం రవి సుమారు 25 సంవత్సరాల క్రితం కడప నగరంలోని తిలక్‌నగర్ ఎస్టీ కాలనీకి చెందిన రామలక్షుమ్మ (42)ను వివాహం చేసుకున్నాడు. మరికొన్నేళ్లకు రామలక్షుమ్మ సమీప బంధువును కూడా వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల రవి రాయచోటికి చెందిన తన సమీప బంధువుల అమ్మాయిని మూడవ వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయమై తరచూ రామలక్షుమ్మ, రవిల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇటీవల రవి కొద్ది రోజులు ఇంటి పట్టున లేకుండా రాయచోటికి వెళ్లి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య రవిని ప్రశ్నించింది. ఇదే విషయమై బుధవారం రాత్రి కూడా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో తాను తప్పనిసరిగా నా బంధువుల అమ్మాయిని వివాహం చేసుకుంటానని రవి తేల్చి చెప్పాడు. ‘నీవు మరో వివాహం చేసుకుంటే నేను చనిపోతాను’ అని రామలక్షుమ్మ తెలిపింది. ‘నీవు ఏమైనా నాకు ఫర్వాలేదు. నేను పెళ్లి చేసుకునే తీరుతాన’ని రవి తెలిపాడు. దీంతో మనస్తాపానికి గురైన రామలక్షుమ్మ ఇంటిలోని మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని కత్తితో కడుపులో, ఎడమ చేతిపైన పొడుచుకుంది. చుట్టుపక్కల వారు గమనించి రామలక్షుమ్మను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. తమ అక్క మృతికి కారణమైన రవిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రైలు కింద పడి..
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల పట్టణంలోని ఆవుల క్రిష్ణయ్య(64) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం రైల్వే ట్రాక్‌పై గూడ్స్ రైలు వస్తుండటంతో దాని కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలుపుతున్నారు. క్రిష్ణయ్య ముద్దనూరు రోడ్డులో టీఎంఆర్ మాల్ వెనుక వీధిలో నివాసం ఉంటున్నాడు. ఇతను హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగించే వాడు. అయితే గత కొద్దికాలం నుంచి అనారోగ్యంతో మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (45) అతిగా మద్యం సేవించి మృతి చెందాడు. గత రెండు రోజులుగా మద్యం సేవించి అక్కడే పడి వున్నాడు. గురువారం తెల్లవారుజామున చనిపోయాడు. అతని మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు. ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా సీఐ: 9121100510కు గానీ, ఎస్‌ఐ సెల్ నెంబర్: 9121100511లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలియజేశారు.

భర్త మూడో పెళ్లికి యత్నం.. మొదటి భార్య ఆత్మహత్య