
ఫుడ్ కార్పొరేషన్ అఽధికారుల పర్యటన
కడప కోటిరెడ్డిసర్కిల్ : న్యూఢిల్లీకి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. గొరిగెనూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం, రైతు సేవ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే జమ్మలమడుగు వ్యవసాయ మార్కెట్‌యార్డును సందర్శించి రైతులకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. ఎర్రగుంట్ల మండలం చిలంకూరులోని ఓ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఒకే దేశం ఒకే కార్డు పథకం కింద దేశంలోని ఏ రేషన్ షాపు నుంచి అయినా కార్డుదారులు బియ్యం పొందవచ్చని తెలియజేశారు. అనంతరం కడపలోని బఫర్ గోడౌన్‌కు చేరుకుని బియ్యం నాణ్యత, పోర్టిఫైడ్ బియ్యం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీకే దిన్నె మండలం బోడెద్దులపల్లి చౌక దుకాణం పరిధిలోని కార్డుదారులతో మాట్లాడారు. వారు తెలిపిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శిరీష, జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.