
అరుణాచలం.. రైలులోనూ వెళ్దాం
కడప కోటిరెడ్డిసర్కిల్ : పంచభూతాత్మక లింగాల్లో అగ్ని లింగం తేజోలింగంగా పేరొందిన అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి అధికంగా ఉంటోంది. గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు తరలి వెళుతున్నారు. కడప మీదుగా రైలు సదుపాయం ఉన్నా అవగాహన లేక భక్తులు బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే సౌకర్యంపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.
కడప నుంచి అరుణాచలానికి రోడ్డు మార్గాన వెళ్లేందుకు దాదాపు 300 కి.మీ. దూరం ఉంటోంది. ఆర్టీసీ బస్సుల్లో సూపర్ లగ్జరీల్లో అయితే దూరాన్ని బట్టి రానుపోను రూ.1050 నుంచి 1300 వరకు చార్జీగా ఉంది. ఒకవేళ కారులో వెళితే దాదాపు రూ. 8–10 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటన్నింటితో పోలిస్తే రైలులో ప్రయాణిస్తే చార్జి తక్కువగా ఉన్నా.. రిజర్వేషన్ అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
అందుబాటులో రైల్వేస్టేషన్లు
వైఎస్సార్ జిల్లా నుంచి పలు రైళ్లు అరుణాచలం సమీపానికి వెళుతున్నాయి. కడప నుంచి విల్లుపురం 360 కి.మీ. దూరంలో ఉంది. అయితే విల్లుపురం నుంచి అరుణాచలం 60 కి.మీ. దూరంలో ఉంది. ఎవరైనా అరుణాచలం వెళ్లాలంటే విల్లుపురం వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి రైలులో గానీ, బస్సులో గానీ, ఇతర వాహనాల్లో కూడా వెళ్లవచ్చు.
కడప మీదుగా వెళుతున్న రైళ్ల వివరాలు
అహ్మదాబాద్ నుంచి తిరుచానపల్లికి వెళ్లే వారాంతపు రైలు (09419) ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు కడపకు చేరుకుని అదే రోజు సాయంత్రం 7.15 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు (09420)మధ్యాహ్నం 12.10 గంటలకు విల్లుపురంలో బయలుదేరి కడపకు రాత్రి 8.25 గంటలకు చేరుతుంది. ఈ రైలు కడప స్టేషన్‌లో మాత్రమే ఆగుతుంది.
● లోకమాన్య తిలక్–మధురై (22101) రైలు ప్రతి గురువారం తెల్లవారుజామున 5.40 గంటలకు కడపకు చేరుకుని.. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విల్లుపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (22102) రైలు విల్లుపురంలో శుక్రవారం రాత్రి 8.40 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు తెల్లవారుజామున 3.10 గంటలకు కడపకు చేరుతుంది. ఈ రైలులో రానుపోను రూ.550 చార్జిగా నిర్ణయించారు.
● ముంబయి–కరైకాల్ ఎక్స్‌ప్రెస్ (11017) వారాంతపు రైలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటలకు కడపకు చేరుకుని మధ్యాహ్నం 1.55 గంటలకు విల్లుపురం చేరుతుంది. తిరిగి ఇదే రైలు (11018) విల్లుపురంలో సాయంత్రం 7.25 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు తెల్లవారుజామున 3.10 గంటలకు కడపకు చేరుతుంది.
● ముంబయి–నాగర్‌కోయిల్ (16351) ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి రెండు సార్లు నడుస్తుంది. ఈ రైలు ప్రతి మంగళ, శనివారాల్లో మధ్యాహ్నం 1.20 గంటలకు కడపకు చేరుకుని, అదే రోజు రాత్రి 9.30 గంటలకు విల్లుపురం చేరుతుంది.
● కడప నుంచి అరుణాచలానికి ఓకా–మధురై (09520) ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులో ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం సాయంత్రం 6.05 గంటలకు కడపకు చేరుకుని మరుసటి రోజు తెల్లవారుజామున 3.40 గంటలకు అరుణాచలానికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (09519) అరుణాచలంలో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరి.. అదే రోజు మధ్యాహ్నం 1.55 గంటలకు కడపకు చేరుతుంది. ఈ రైలులో జనరల్ క్లాస్‌లో రూ.140, స్లీపర్‌లో రానుపోను రూ. 790, ఏసీ త్రీ టైర్‌లో రూ.2370లుగా చార్జీ నిర్ణయించారు.
● కాచిగూడ–పాండిచ్చేరి వెళ్లే రైలు (17653) ప్రతి సోమ, గురు, శనివారాల్లో కాచిగూడలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 1.30 గంటలకు కడపకు చేరుకుని ఉదయం 9.00 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 3 గంటలకు విల్లుపురంలో బయలుదేరి రాత్రి 10 గంటలకు కడపకు చేరుకుంటుంది.
ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి
వైఎస్సార్ జిల్లా నుంచి అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య బాగా పెరుగుతోంది. నేరుగా వెళ్లేందుకు ఓకా–మధురై ఎక్స్‌ప్రెస్, కడప నుంచి అరుణాచలంకు సమీపంలోగల విల్లుపురం వెళ్లే రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కడప నుంచి కాట్పాడికి వెళ్లి అక్కడి నుంచి నేరుగా అరుణాచలానికి వెళ్లవచ్చు. రైల్వేశాఖ అందిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
– జనార్దన్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్, కడప
అతి తక్కువ చార్జీతో ప్రయాణం
అన్ని వర్గాలకు అనుకూలం

అరుణాచలం.. రైలులోనూ వెళ్దాం