వనిపెంట గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వనిపెంట గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం

Jul 8 2025 5:08 AM | Updated on Jul 8 2025 5:08 AM

వనిపె

వనిపెంట గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం

మైదుకూరు : మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల నిత్యం ఏదో ఒక సమస్యతో వార్తలకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం సరిగా చదవకపోవడం, శుభ్రంగా ఉండటం లేదనే కారణంతో ఓ విద్యార్థినికి ప్రిన్సిపాల్‌ టీసీ ఇచ్చి పంపిన సంఘటన వివాదాస్పదమైంది. తాజాగా సోమవారం పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న డి.జ్యోతి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వనిపెంటకు చెందిన డి. జ్యోతి 8 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిపై గురుకుల పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉపాధ్యాయిని జ్యోతి ప్రిన్సిపాల్‌ నిర్మల ఛాంబర్‌లోకి వెళ్లి టీచింగ్‌ డైరీ (వర్క్‌ డన్‌ స్టేట్‌మెంట్‌) అందజేశారు. కొద్ది సేపటికి పాఠశాలలోని ఓ గదిలో ఒక్క సారిగా తూలి కింద పడిపోయిన ఆమె అక్కడున్న స్టాఫ్‌ నర్స్‌తో తాను నిద్ర మాత్రలు మింగానని చెప్పారు. దాంతో అక్కడి సిబ్బంది, కొందరు ఉపాధ్యాయులు ఆమెకు ఉప్పు కలిపిన నీటిని తాగించారు. అంతలోనే పాఠశాల వద్దకు చేరుకున్న ఉపాధ్యాయురాలు భర్త సుధీర్‌ ఆటోలో ఆమెను తీసుకుని వనిపెంటలోని ఓ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. తన చావుకు ప్రిన్సిపాల్‌ నిర్మల వేధింపులే కారణమంటూ ఉపాధ్యాయిని జ్యోతి రాసినట్టుగా సోమవారం సాయంత్రం 4 పేజీల సూసైడ్‌ నోట్‌ వెలుగు చూసింది. పాఠశాలలో 8 ఏళ్లుగా తాను ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయిని జ్యోతి సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాల తెరిచినప్పటి నుండి ప్రిన్సిపాల్‌ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తనకు మూడు నెలల పాప ఉన్నా రోజూ అన్ని క్లాసులకు హాజరై పాఠాలు చెబుతున్నానని పేర్కొన్నారు. స్కూల్‌ విషయాలను బయటికి చేరవేస్తున్నట్టు తనపై అనుమానంతో ప్రిన్సిపాల్‌ వేధిస్తున్నారని రాశారు. మిగతా ఉపాధ్యాయినులను తనతో మాట్లాడకుండా కట్టడి చేశారని ఆరోపించారు. తనకు మెమో ఇవ్వాల్సిందిగా తన స్నేహితులతోనే ప్రిన్సిపాల్‌ చెప్పారని, ఆ అవమానంతోనే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. పాఠశాలపై ఆరోపణలు వచ్చిన ప్రతి సారి అధికారులు ప్రిన్సిపాల్‌ చెప్పే మాటలు నమ్మి నిజాలు తేల్చకుండానే వెళ్తున్నారని సూసైడ్‌ నోట్‌లో ఉపాధ్యాయిని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయిని జ్యోతి రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మైదుకూరు అర్బన్‌ ఎస్‌ఐ చిరంజీవి, ఎంఈఓ పద్మలత, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అర్జున్‌ వేర్వేరుగా పాఠశాల వద్దకు చేరుకుని జరిగిన సంఘటనపై విచారించారు.

మాట్లాడుతున్న పాఠశాల ప్రిన్సిపాల్‌ నిర్మల

ఉపాధ్యాయిని జ్యోతి ఆత్మహత్యాయత్నంపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ వి.నిర్మల మాట్లాడుతూ తాను ఉపాధ్యాయిని జ్యోతిని వేధించలేదన్నారు. అందరితోపాటు ఆమె జూన్‌ నెల టీచింగ్‌ డైరీ సబ్‌మిట్‌ చేయలేదని తెలిపారు. సోమవారం తనకి తానే తన ఛాంబర్‌లోకి వచ్చి టీచింగ్‌ డైరీ ఇచ్చారని చెప్పారు. అందులో ఆమె సెలవులో ఉన్న రోజుల్లోనూ, ఆదివారం కూడా పాఠాలు బోధించినట్టు పొందుపరిచారని వివరించారు. దాంతో అలా తప్పుగా ఎందుకు రాశారని అడిగానని దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. ఉపాధ్యాయినులు ఎవరు ఆ విధంగా చేసినా వివరణ కోరడం మామూలుగా జరుగుతుందని పేర్కొన్నారు. తన ఛాంబర్‌ నుంచి ఉపాధ్యాయిని జ్యోతి వెళ్లిన కొద్ది సేపటికి సిబ్బంది వచ్చి తాను నిద్ర మాత్రలు మింగానని జ్యోతి మేడమ్‌ చెబుతున్నారని తనతో అనగా, వెంటనే చికిత్స కోసం తీసుకెళ్లాలని చెప్పానన్నారు. అదే సమయంలో ఆమె భర్త మరికొందరు బయట వ్యక్తులు పాఠశాల వద్దకు వచ్చి ఆమెను ఆటోలో తీసుకెళ్లారని వివరించారు. కాగా ఉపాధ్యాయిని జ్యోతి తన ఛాంబర్‌ నుంచి వెళ్లిన కొద్దిసేపటికే కింద పడిపోవడం, అదే సమయంలో ఆమె భర్త పాఠశాల వద్దకు చేరుకోవడం అతని వెనకే ఎలాంటి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు మోటార్‌ బైక్‌లపై పాఠశాలలోకి రావడం ఇదంతా ముందుగా వేసుకున్న పథకంగా అనిపిస్తుందన్నారు. పాఠశాలలో జరిగే సంఘటనల వెనుక బయటి వ్యక్తులు ఉన్నారని ప్రిన్సిపాల్‌ ఆరోపించారు. గతంలో బయటి వ్యక్తులు పాఠశాలలో ఇష్టారాజ్యాంగా ఉండేవారని, తాను ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టాక అవన్నీ కట్టడి చేశానన్నారు. ఏదో ఒక విధంగా తనను ఇక్కడి నుంచి పంపించాలని సమస్యలను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వనిపెంట గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం1
1/1

వనిపెంట గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement