
ఉరి వేసుకుని మహిళా రైతు ఆత్మహత్య
చాపాడు : మండల పరిధిలోని పల్లవోలు గ్రామానికి చెందిన మహిళా రైతు కటారు రామాంజనమ్మ(47) శనివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ చిన్నపెద్దయ్య, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. రామాంజనమ్మ గత కొన్నేళ్లుగా భర్తతో కలసి వ్యవసాయం చేసుకుంటూ, పాడి పశువులతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయంలో నష్టాలు రావడం, అప్పులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మనస్థాపం చెందటంతో పాటు మతిస్థిమితం సరిగా లేని తన కూతురు విషయం గురించి కూడా ఆమె బాధపడేది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.