గండి టెండర్లలో నిబంధనలకు పాతర | - | Sakshi
Sakshi News home page

గండి టెండర్లలో నిబంధనలకు పాతర

Jul 7 2025 6:30 AM | Updated on Jul 7 2025 6:30 AM

గండి టెండర్లలో నిబంధనలకు పాతర

గండి టెండర్లలో నిబంధనలకు పాతర

చక్రాయపేట : గండి క్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా నిర్వహించే టెండర్లలో నిబంధనలకు పాతర వేసినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక పూల అలంకరణకు పూలు సరఫరా, చలువ పందిళ్లు, బారికేడ్లు, విద్యుద్దీపాల అలంకరణ అని ఆలయ అధికారులు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ప్రతికల్లో ప్రకటనలు కూడా అలాగే ఇస్తున్నారు. అయితే ప్రత్యేక పూల అలంకరణ అంటే ఆలయానికా లేక మూలవర్లకా అనే వివరాలు పొందు పరచలేదు. దీనికి తోడు మూలవర్లకు ప్రత్యేక అలంకరణ అంటే తోమాలలు ఎన్ని అవసరం, అవి ఎన్ని కిలోల బరువు ఉండాలి, అలంకరణ బిట్లు ఎన్ని కావాలి, వాటి బరువెంత, అలాగే పలు రకాల అల్లిన పూలు ఎన్ని కావాలి.. ఏయే రకాలు కావాలి అని కాని ఆలయంలో అలంకరణకు బంతి పూలు ఎన్ని మూరలు అనో లేక ఎన్ని కిలోలు అని వివరాలు ఉండటం లేదు. అలాగే చలువ పందిళ్లు అంటే అవి ఎన్ని అడుగులు ఎక్కడెక్కడ ఎన్ని వేయాలి అనే విషయాలు ఉండటం లేదు. బారికేడ్లు, విద్యుద్దీపాలు సీరియల్‌ సెట్లు, ఫోకస్‌ లైట్లు, డిజిటల్‌ బోర్డులు కూడా ఎక్కడ వేయాలి ఎన్ని వేయాలి అనే వివరాలు పొందుపరచలేదు. ముందుగానే వివరాలు ఉండక పోవడంతో టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ తక్కువ మోతాదులో తెచ్చి వేయడం, చాలక పోతే మరో వారానికి తెప్పించి వేయడం జరుగుతుంది. దీని వల్ల కాంట్రాక్టర్‌కు మేలు జరుగుతుంది కాని ఆలయ ఆదాయానికి గండి పడుతుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏటా వేయిస్తూనే ఉన్నప్పటికీ..

శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా ఏటా అధికారులు టెండర్లు వేయిస్తున్నారు. ఏవేవి ఎన్ని అవసరమో ఆ వివరాలు అన్ని కూడా ఆలయ కార్యాలయంలోనే అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులు పరిశీలిస్తే ఈ దఫా ఏవేవి ఎన్ని అవసరం అనే విషయాలు కచ్చి తంగా తెలుస్తాయి. గతంలో ఏవి ఎక్కడ వేశారో ఇ ప్పుడు అక్కడే వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లయ పరిధిలో విస్తీర్ణం తక్కువగానే ఉంది. ఈ విష యం ఆలోచించకనే దేవదాయశాఖ అధికారులు టెండర్లు పిలవడం నిబంధనలను పక్కన పెట్టినట్లేనని పలువురు భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పూల విక్రయ హక్కు టెండర్లలో చెప్పేది ఒకటి జరిగేది మరొకటి..

ఏడాది కాలం పాటు పూలు విక్రయించుకునే హక్కు విషయంలో అధికారులు చెప్పేది ఒకటయితే అనంతరం టెండరు దక్కించుకున్న వ్యక్తి చేసేది మరోలా ఉంటోంది. పూల విక్రయం అంటే పూలు, పూల దండలు మాత్రమే విక్రయించాలి. కాని ఇక్కడ వాటిని అసలు విక్రయించరు. తమలపాకులు తెచ్చి వాటిని దండలా కూర్చి దేవస్థానం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ దండలకు చివరన పూలతో కుచ్చును కూడా ఏర్పాటు చేయరు. ఈ విషయాన్ని పలువురు భక్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. టెండర్ల సమయంలో తమలపాకుల దండల ఊసే లేకున్నా కాంట్రాక్టర్లు వాటినే విక్రయించడంపై విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

ఖాళీ స్థలం టోల్‌గేట్ల కాంట్రాక్టర్‌కు వరం

ఆలయ పరిధిలోనే గల నూతన కల్యాణ మండపం ఎదురుగా ఉన్న స్థలం టోల్‌గేట్ల కాంట్రాక్టర్‌కు వరంలా మారుతోంది. గత శ్రావణ మాసంలో ఈ ఖాళీ స్థలం టోల్‌గేట్‌ కాంట్రాక్టరుకు అప్పగించారు. టోల్‌ గేట్‌ టెండర్ల సమయంలో ఈ ఖాళీ స్థలం ప్రస్తావనే లేదు. శ్రావణ మాస ఉత్సవాలు వచ్చే సరికి ఈ స్థలాన్ని సదరు కాంట్రాక్టరుకు అప్పగించారు. దీంతో ఆ కాంట్రాక్టరు ఆ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేయించి వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు ఒక్కో దుకాణం వద్ద నుంచి 40 నుంచి 50 వేల వరకు బేరం కుదుర్చుకొని అందులోనే 30 నుంచి 40 వరకు దుకాణాలు, హోటళ్లను ఏర్పాటు చేయించారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు, పాలకమండలి స్పందించి టెండర్ల వివరాలు పూలు ఎన్ని కిలోలు, ఏయే రకాలు, బారికేడ్లు ఎన్ని అడుగుల దూరం, చలువ పందిళ్లు ఎన్ని, వాటి విస్తీర్ణం ఎన్ని అడుగులు, బార్‌ లైట్లు ఎన్ని, ఫోకస్‌ లైట్లు ఎన్ని అనే వివరాలు పూర్తిగా వివరించి ఆ మేరకు టెండర్లు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. లేకుంటే ఆలయ ఆదాయానికి గండి పడుతుందని పేర్కొంటున్నారు.

రేపు గండిలో టెండర్లు

గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో మంగళవారం శ్రావణ మాస ఉత్సవాలను పురస్కరించుకుని టెండర్లను నిర్వహిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్‌ వెంకటసుబ్బయ్య తెలిపారు. నెల రోజులకు సంబంధించి పూల అలంకరణ కోసం పూలు సరఫరా, విద్యుత్‌ దీపాల అలంకరణ, చలువ పందిళ్లు, బారికేడ్ల ఏర్పాటుకు టెండర్లు నిర్వహిస్తామన్నారు. అలాగే దేవస్థానంలో ఏడాది కాలం పాటు పూలు విక్రయించే హక్కు, టోల్‌ గేట్ల వసూలు, రెండు సంవత్సరాల కాలానికి షాపింగ్‌ కాంప్లెక్స్‌లో గదులకు సంబంధిం టెండర్లు వేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

సరైన మార్గదర్శకాలు లేవంటున్న భక్తులు

ఆలయ ఆదాయానికి

గండికొడుతున్నారని ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement