
అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడులు
కడప అర్బన్ : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి ఈ.జి. అశోక్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో గత 15 రోజుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ జరిపిన దాడుల వివరాలను ఆయన వెల్లడించారు.
● జిల్లాలో గత 15 రోజుల్లో జూదమాడుతున్న మొత్తం 159 మందిని అరెస్టు చేసి రూ. 2,85,645 నగదు స్వాధీనం చేసుకుని 22 కేసులు నమోదు చేశామన్నారు. 9 మట్కా కేసులు నమోదు చేసి మొత్తం 16 మందిని అరెస్టు చేసి రూ. 50,570 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
● జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసి 1.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రెండు కేసులు నమోదు చేశామన్నారు.
● జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై పోలీస్ సిబ్బంది గస్తీ తిరుగుతూ ముమ్మర దాడులు నిర్వహించి 986 మందిపై కేసులు నమోదు చేశారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 57 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.
● జిల్లాలో కోడి పందేల కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేసి రూ. 5,050 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
● అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి మొత్తం 3 కేసులు నమోదు చేసి 13.24 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
● అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనకు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని, మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇతర నేరాలకు సంబంధించిన సమాచారాన్ని డయల్ 112 కు తెలియజేయాలని సూచించారు.