
నకిలీ.. మకిలీ!
వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో చేపడుతున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ నియామకాల్లో బోగస్ సర్టిఫికెట్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. కొంతమంది అడ్డదారుల్లో అక్రమంగా సంపాదించుకోవడానికి ఒక ముఠాగా ఏర్పడి, బోగస్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్లుగా సమాచారం. వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలిస్తే
ఇంకెన్ని నకి‘లీలలు’బయట పడుతాయో... వైద్య ఆరోగ్యశాఖకు అంటుకున్న ఈ మకిలీ ఎప్పుడు తొలగిపోతుందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
కడప రూరల్: కడపలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నియామకాలకు చర్యలు చేపట్టారు. 150 పోస్టులకు గాను దాదాపు 11 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ కార్యాలయ సిబ్బంది వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జాబితాను సిద్ధం చేశారు.
ఎందుకై నా మంచిదని...
దరఖాస్తుల ఆధారంగా నిబంధనల ప్రకారం 200 మందితో అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను సిద్ధం చేశారు. ఎందుకై నా మంచిదని ఆ శాఖ అధికారులు ఎంపికై న సదరు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలన కోసం అమరావతిలోని పారా మెడికల్ బోర్డు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి పంపారు. ఆ మేరకు బీఎస్సీ నర్సింగ్ కు సంబంధించి 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి, జి ఎన్ ఎం నర్సింగ్ కోర్సు చేసిన 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్ ను పారా మెడికల్ బోర్డుకు పంపారు. అందులో 27 మంది అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల్లో బోగస్ సర్టిఫికెట్స్ ఉన్నట్లుగా ధ్రువీకరించారు.
● ఆ 27 మందికి ఆ శాఖ కార్యాలయం నోటీసులు ఇచ్చి, ఒక వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందులో కొంతమంది అసలు తాము దరఖాస్తే చేయలేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. మరి కొందరి ఇంటి చిరునామా తప్పుగా తేలింది. ఇంకొందరు అసలు సమాధానమే ఇవ్వ లేదు. దీంతో అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి, కాగా నిబంధనల ప్రకారం మార్కులు, ప్రతిభ ఆధారంగా అభ్యర్ధులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మూడేళ్ల చొప్పున జీఎన్‌ఎం కోర్స్‌కు 1800, బీఎస్సీ నర్సింగ్‌కు 2,700 మార్కులు ఉంటాయి. ఉద్యోగ నియామకాల్లో ఈ మార్కులతో పాటు సర్వీస్, అకడమిక్ వెయిటేజ్ మార్కులు ఉంటాయి. ఈ మార్కుల మెరిట్‌తో పాటు ఇతర నిబంధనలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.దీంతో అభ్యర్ధులు దొంగ మార్కుల జాబితాను సమర్పించినట్లు సమాచారం.
● గతంలో కూడా బోగస్ సర్టిఫికెట్స్ వ్యవహరం పెద్ద దుమారమే లేపింది. ఈ వ్యవహరానికి సంబంధించి కొందరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వెలుగు చూస్తున్న బోగస్ సర్టిఫికెట్స్ కూడా వారిపనే అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి.
వారి పేర్లు తొలగించాం
బోగస్ సర్టిఫికెట్స్‌గా నిర్ధారణ అయిన అభ్యర్ధుల పేర్లను ఎంపిక జాబితా నుంచి తొలగించాం. ఈ అంశాలను ఉన్నతాధికారులకు విన్నవించాం. నిబంధనల ప్రకారం అభ్యర్థు ల ఎంపిక జాబితాను సిద్ధం చేస్తాం.త్వరలోనే కౌన్సెలింగ్ చేపడతాం. – రామగిడ్డయ్య, ఆర్డీ,
వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం

నకిలీ.. మకిలీ!