
ఘనంగా గంధోత్సవం
కడప సెవెన్‌రోడ్స్: కడప పెద్దదర్గా ప్రధాన గురువు హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ గంధోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గురువు మజార్ వద్ద విశేష ప్రార్థనలు జరిగాయి. ప్రక్క రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. దర్గా నిర్వాహకులకు ఆ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. గంధోత్సవం సందర్భంగా దర్గా విద్యుత్ దీప కాంతులతో మెరిసింది. హజరత్ పీరుల్లామాలిక్ సాహెబ్ సజీవ సమాధి అయిన సందర్భంగా ప్రతి ఏటా మొహర్రం నెల పదోరోజు గంధోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసి పవిత్ర జలాన్ని భక్తులకు అందజేశారు. లంగర్‌లో భోజన ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. భక్తులు పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ను దర్శించుకుని ఆశీస్సులు పొందారు.