
మోసం గ్యారెంటీపై ఇంటింటా ప్రచారం
ప్రొద్దుటూరు : గ్రామం.. వార్డులలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీపై ఇంటింటికీ వెళ్లి తెలపాలని.. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేస్తూ.. కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. స్థానిక శేగిరెడ్డి కాటిరెడ్డి కల్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుది చెత్త పరిపాలన అని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలుచేయని కారణంగా ఏడాదిలోనే వైఎస్సార్‌సీపీ మూడు పెద్ద కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. కరెంట్ చార్జీలు, రైతులకు మద్దతు ధర, వెన్నుపోటు కార్యక్రమాన్ని పెద్దస్థాయిలో నిర్వహించామన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను అమలు చేయలేదనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తుచేస్తూ పోరాటం చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు అమలు చేయని పథకాలను.. తాను చేసినట్లు చూపిస్తున్నారన్నారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరకు అందరిపై దొంగ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 143 రోజులు అక్రమంగా జైలులో ఉంచారన్నారు. ఈ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని, టీడీపీ నేతలను గుర్తించి బ్లూబుక్‌లో నమోదు చేయాలని కోరారు. 2.0 జగన్ పరిపాలనను మనమందరం చూస్తామని, అపుడు కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామన్నారు. చంద్రబాబు తప్పులను గుర్తుచేస్తూ పార్టీని రక్షించుకునేందుకు నిత్యం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, భవిష్యత్తు అంతా కార్యకర్తలదేనన్నారు. ఏనాడు చంద్రబాబు చరిత్రలో పోరాటం చేసిన పరిస్థితి లేదన్నారు.
వైఎస్‌తో రాజకీయ ప్రస్థానం..
వైఎస్ రాజశేఖరరెడ్డితో చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలైందని, ఆయన కుమారుడు అయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఆయన పరిపాలనకు శుభం కార్డు పడుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. జగన్ పట్ల తాను అత్యంత విశ్వసనీయత కలిగి ఉన్నానని, ఆయన కోరితే దేనికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. 2028లో జమిలి ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి ఓటమి తప్పదన్నారు. 2026లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి అన్ని ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా కృషి చేద్దామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఈ మూడు పార్టీలు విడిపోతే ఓడిపోతామనే భయం వారికి కల్పించింది మాత్రం జగనే అన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రతీకారంతో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు పనిచేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంట్ పరిశీలకుడు కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలను తెలుసుకోవచ్చన్నారు. జగన్‌ను మళ్లీ సీఎం చేసుకునేందుకు సంఘటితంగా పోరాటం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పోస్టర్లను ముఖ్య నేతలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ పోరాటంతోనే
తల్లికి వందనం అమలు
భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకు పెద్దపీట
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి