
సర్పంచ్ అవినీతిపై ప్రమాణానికి సై
ప్రొద్దుటూరు : కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అవినీతిని నిరూపించడానికి తాను ఎక్కడ ప్రమాణం చేయడానికై నా సిద్ధంగా ఉన్నానని ప్రొద్దుటూరు ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్ తెలిపారు. టైం, డేట్‌ను ఆయనే ఫిక్స్ చేయాలని పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఖాదరాబాద్ గ్రామంలో ఉన్న తన స్థలానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి తాను నిర్మిస్తున్న కట్టడాన్ని కూల్చారన్నారు. దీనిని తాను అడ్డుకున్నానన్నారు. తన స్థలం ఖాదరాబాద్‌లో ఉండగా టీడీపీ కౌన్సిలర్ మునీర్ అహ్మద్ తయారు చేసిన డాక్యుమెంట్‌లోని సర్వే నంబర్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని బ్రాందీ షాపు సిద్ధయ్య ఇంటి వద్ద ఉందన్నారు. సర్పంచ్ శివచంద్రారెడ్డి ప్రమేయంతోనే తన స్థలంలోని నిర్మాణాన్ని కూల్చారన్నారు. ఎన్నడూ లేని విధంగా సర్పంచ్ అయ్యాక శివచంద్రారెడ్డి భూ కబ్జాలు, ఆక్రమణలు, బెదిరింపులతో కోట్ల రూపాయలు ఆర్జించారని ఆరోపించారు. శివచంద్రారెడ్డి సర్పంచ్ కాకముందు ఆయనకు ఎంత ఆస్తి ఉందో.. ఇప్పుడు ఆస్తి ఎంత ఉందో చెప్పాలని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సహకారంతో తాను సర్పంచ్ నుంచి ఎంపీపీ స్థాయికి ఎదిగానన్నారు. సమావేశంలో సోములవారిపల్లె సర్పంచ్ మోపూరి ప్రశాంతి, సానబోయిన శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.