
కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు చర్యలు
కడప సెవెన్‌రోడ్స్: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు ఉన్న కార్డుల్లో మార్పులు, చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి అవకాశం కల్పించిందని జేసీ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కొత్త బియ్యం కార్డు, కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేరిక, బియ్యం కార్డులో పేర్లు తొలగింపు, కార్డును ప్రభుత్వానికి అప్పగించడం, కార్డులో చిరునామా మార్పు, కార్డులో తప్పుడు ఆధార్ కార్డు సీడింగ్ సరిచేసేందుకు అవకాశం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సేవలు గతంలో ఆమోదించబడిన ప్రామాణికాల ప్రకారం అందించబడుతాయని జేసీ వివరించారు.
నేడు సుగవాసి అంత్యక్రియలు
రాయచోటి: రాజంపేట మాజీ ఎంపీ, రాయ చోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాయచోటిలో గురువారం ఉదయం 9 గంటల నుండి అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించనున్నామని కలెక్టర్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్ల కోసం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఇతర అధికారులకు సూచనలను చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సౌమ్యనాథ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు
నందలూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించగా రూ.2,64,921 వచ్చినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుండీ ఆదాయాన్ని నెలరోజుల తర్వాత లెక్కించామని.. వచ్చిన మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, విజిలెన్స్ అధికారి జనార్ధన, భక్తులు పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్: అసంఘటిత రంగ కార్మికులు ప్రభుత్వ అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది రవితేజ తెలిపారు. బుధవారం కడప రైల్వేస్టేషన్, ఆటోస్టాండ్, రవీంద్రనగర్, పాత బస్టాండు, పండ్ల మార్కెట్‌లో అసంఘటితరంగ కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టపరమైన సహాయం, ఆస్తి వివాదాలు, బాల కార్మికులు, ఉద్యోగి, యజమాని సమస్యలు, ఈ–శ్రమ్ కార్డులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిర్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది ప్రవీణ్‌కుమార్, పారా లీగల్ వలంటీర్ ఈశ్వరయ్య, అసంఘటిత రంగ కార్మికులు పాల్గొన్నారు.
రేపు హార్సిలీహిల్స్‌కు
ఒబెరాయ్ చైర్మన్ రాక
బి.కొత్తకోట: రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, ఒబెరాయ్ హోటల్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అర్జున్ ఒబెరాయ్‌తో కలిసి మండలంలోని హార్సిలీహిల్స్‌పై శుక్రవారం పర్యటించనున్నారు. పర్యాటక రంగ అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై ప్రఖ్యాత హోటల్స్ సంస్థ ఒబెరాయ్ సంస్థకు 20.93 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిలో సెవెన్‌స్టార్ హోటళ్ల నిర్మాణం, విల్లాలను నిర్మించి అతిథిరంగాన్ని అభివృద్ధి చేయాలని గత సీఎం వైఎస్ జగన్‌న్ మోహన్ రెడ్డి నిర్ణయించి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయంపై విల్లాలను నిర్మించి 250 మందికిపైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఒబెరాయ్ ముందుకొచ్చింది. తర్వాత గత ఏడాది ఆగష్టులో కలెక్టర్ శ్రీధర్, సంస్థ ప్రతినిధులు కొండపై కేటాయించిన భూమిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి వాతావరణం, పరిస్థితులు నచ్చడంతో నిర్మాణానికి తాము సిద్ధమే అన్న సంకేతాలను ఇచ్చారు. ప్రస్తుతం సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వస్తుండటంతో నిర్మాణ పనులకు బీజంపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి పర్యటన కోసం రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.