
సాంకేతిక విద్యతో బంగారు భవిత
కడప ఎడ్యుకేషన్ : వైఎస్సార్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 27 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది 161 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో పది విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే పాలీసెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే నోటిఫికేషన్ విడుదల చేసింది. పది పరీక్ష రాసే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్ పరీక్షలో లభించిన ర్యాంకు మేరకు పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ ఏడాది మార్చిలోనే పాలీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తం
గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి అత్యున్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వీరికి తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి పాలిటెక్నిక్ కోర్సులు వేదికగా నిలుస్తాయి. పాలీసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సులో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
కోర్సుల వివరాలివీ..
పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, మెకానికల్, సివిల్, ఇంటర్నెట్ ఆప్ థింగ్స్(ఐఓటి) మెటలాజికల్ ఇంజినీర్(ఎంఈటి) కోర్సులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలో కడప, పొద్దుటూరు, వేంపల్లి, సింహాద్రిపురం, జమ్మలమడుగు, మైదుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల పరిధిలో దాదాపు 3800 సీట్లు ఉన్నాయి. ఇందులో కడపలో ప్రత్యేకంగా మహిళా పాలిటెక్నిక్ ఉంది. ఈ కోర్సు కాల వ్యవధి మూడు సంవత్సరాలు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్ ఎంట్రన్స్‌లో క్వాలిపై మార్కులు 35గా నిర్ణయించారు.
పాలీసెట్ నోటిఫికేషన్ ఇలా...
దరఖాస్తుకు గడువు : ఏప్రిల్ 15
ప్రవేశ పరీక్ష : ఏప్రిల్ 30
ఫలితాల వెల్లడి : మే 10
కౌన్సెలింగ్ ప్రారంభం : జూన్‌లో
పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
పదో తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం
మార్చి చివరకు ముగియనున్న పది పరీక్షలు
పాలీసెట్ నోటిఫికేషన్ ఇదీ..
పాలీసెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఏప్రిల్ 15వ తేదీలోపు పాలీసెట్ అప్లికేషన్ సబ్‌మిట్ చేసుకోవాలి. ఏప్రిల్ 30న పరీక్ష ఉంటుంది. మే 10న ఫలితాలను ప్రకటిస్తారు. జూన్‌లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. గణితంలో 50, ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 30 మార్కులకు ప్రశ్నలు పదో తరగతి సిలబస్ ఆధారంగా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ,బీసీ విద్యార్థులు రూ.400 పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
ఎన్నో ఉద్యోగావకాశాలు...
పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ చేస్తే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కళాశాలల్లో తరచూ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు మూడేళ్లు ఉంటుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్‌లో చేరవచ్చు. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి తోడ్పడుతుంది. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – సీహెచ్.జ్యోతి, ప్రిన్సిపల్, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, కడప

సాంకేతిక విద్యతో బంగారు భవిత