కడప కల్చరల్ : గండికోట వివరాలతో కూడిన డోసియర్(వివరాల పత్రం)ను వెంటనే పంపితే యునెస్కో జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉందని అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు. ఢిల్లీ తిలక్‌మార్గ్ లోని కేంద్ర పురావస్తుశాఖ కార్యాలయంలో డీజీ యధువీర్‌సింగ్ రావత్‌తో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా గండికోట, లేపాక్షి తదితర ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు ఇవ్వాలని వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం వీరాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి కట్టడాలకు సంబంధించి వివరాలు ఇంతవరకు తమకు అందలేదని డీజీ యదువీర్‌సింగ్ రావత్ అన్నారన్నారు. రాష్ట్రంలోని 129కి పైగా చారిత్రక కట్టణాల్లో ఒక్క దానికి యునెస్కో జాబితాలో చోటు దక్కలేదని, కూటమి ప్రభుత్వం ఆలోచించి ఇకనైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చారిత్రక కట్టడాలకు యునెస్కోలో చోటు దక్కినపుడే రాష్ట్రం, జిల్లా అభివృద్ధి చెందగలదన్నారు. పర్యాటకశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే నివేదిక పంపాలన్నారు.