కాశినాయన : వైఎస్సార్ జిల్లా కాశినాయన ఆలయ సంరక్షణకు చర్యలు తీసుకుంటామని ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కె.కె.చౌదరి అన్నారు. జ్యోతి క్షేత్రంలో కూల్చిన కాశినాయన ఆలయ భవనాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. కాశినాయన ఆశ్రమంలో అటవీశాఖ అనుమతులు లేవని భవనం కూల్చిన విషయం ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లిందన్నారు. వెంటనే ఆయన స్పందించి ప్రభుత్వం తరఫున తనను వెళ్లి పరిశీలించమన్నారన్నారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దారు నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.
ఆరుగురు జూదరుల అరెస్టు
రాజుపాళెం : మండలంలోని టంగుటూరులో దక్షిణం వైపు ఉన్న కంపచెట్ల వద్ద జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.11,520 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ కత్తి వెంకటరమణ తెలిపారు. కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.
అరటికాయల లారీ బోల్తా
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం నల్లగొండువారిపల్లె ఘాట్ రోడ్డులో బుధవారం సాయంత్రం అరటికాయల లారీ బోల్తా పడింది. గ్రామ సమీపంలోని తోట వద్ద అరటి కాయలను లోడు చేసుకుని పులివెందులకు వస్తుండగా బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.
వేలంలో రూ 93.25 లక్షల ఆదాయం
బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో బుధవారం తలనీలాల వేలం పాట నిర్వహించారు. అనంతపురానికి చెందిన ఎంఆర్ ప్రాజెక్టు నిర్వాహకులు రూ.93.25 లక్షలకు వేలంపాడి దక్కించుకున్నారు. గత ఏడాది రూ.81 లక్షల ఆదాయం వచ్చినట్లు పిట్ పర్సన్ శంకర్‌బాలాజీ తెలిపారు.
ఆలయ సంరక్షణకు చర్యలు తీసుకుంటాం