
డీఎస్పీ కార్యాలయ భవన సముదాయాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
● ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, డీఎస్పీ కార్యాలయానికి అధునాతన భవనాలు
● రూ.3.50 కోట్లతో నిర్మాణం
● నేడు ప్రారంభించనున్న డీజీపీ, ఎమ్మెల్యే
రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అంశాలపై స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి జిల్లా అధికారులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో డీఎస్పీ కార్యాలయంతోపాటు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు విశాలమైన స్థలంలో రూ.3.50 కోట్లతో అధునాతన భవనాలు నిర్మించారు. రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంలోనూ, జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాలకు స్థలాల కేటాయింపు, అధునాతన భవనాల నిర్మాణంలోనూ మరీ ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణ, రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిలు తీసుకుంటున్న చొరవ సత్ఫలితాల దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లా కేంద్రం కాకమునుపే రాయచోటిలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, డీఎస్పీ కార్యాలయం మంజూరు చేయించారు. రాయచోటి పట్టణ ప్రాంతంలో జనాభా విస్తరిస్తున్న దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు అనుగుణంగా పోలీస్ కార్యాలయాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపారు. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు, డీఎస్పీ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌ను పట్టణ పరిధి చిత్తూరు మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఎస్టీ కాలనీ వద్ద 1.14 ఎకరాల విస్తీర్ణంలోను, డీఎస్పీ కార్యాలయాన్ని కడప రహదారి మార్గంలో ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా 1.50 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా, శరవేగంగా భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఈ భవనాలు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించేలా జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు.
నేడు జిల్లాకు డీజీపీ రాక
కడప అర్బన్: రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి (డీజీపీ) కె. రాజేంద్రనాథ్‌రెడ్డి వైఎస్‌ఆర్ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదట అన్నమయ్య జిల్లా రాయచోటికి సోమవారం ఉదయం వెళ్లి అక్కడి కార్యక్రమాలు చూసుకుంటారు. మధ్యాహ్నం భోజనం తరువాత కడపకు వచ్చి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారని పోలీసు వర్గాల సమాచారం.