భువనగిరి : ఒక వైపు బడిబాట.. మరోవైపు జనగణన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో బడిబాట నిర్వహిస్తుంటారు. ఇదే సమయంలో ఈ సారి కేంద్ర ప్రభుత్వం జనగణన కార్యక్రమం చేపట్టింది. ఎక్కువ మంది ఉపాధ్యాయులకు విధులు అప్పగించారు. జనగణనతోపాటు తమ హెల్త్‌కార్డుల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడం, సర్వీస్‌బుక్‌లకు సంబంధించి డిజిటలైజేషన్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. అయితే మిగిలిన ఉపాధ్యాయులు బడిబాటను నామమాత్రంగా కొనసాగిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరే విషయంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
జూన్ 19 వరకు బడిబాట..
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవాల్లో ఈ ఏడాది 715 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5వేల మందికి తగ్గకుండా విద్యార్థులను చేర్పించాలనే లక్ష్యంతో ఈ నెల 14వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జూన్ 19 వరకు కొనసాగనుంది. వీటితో పాటు జూన్ 3న గ్రామ సభ, 4న అవగాహన ర్యాలీ, 5, 6 తేదీల్లో ప్రత్యేక అవసరాల గల వారితోపాటు బడిబయట ఉన్న పిల్లలను గుర్తించాలి. 8 నుంచి 10వ వరకు ఇంటింటా ప్రచారం, 12న వెల్‌కమ్ డే, 15న సామూహిక అక్షరాభ్యాసం, 16న ఎఫ్‌ఎల్‌ఎన్ డే, 17న బాలిక, సమ్మిళిత దినోత్సవం, 18న డిజిటల్ అవర్ నెస్ డే, 19న స్పోర్ట్స్ డేతో బడిబాట కార్యక్రమం ముగియనుంది.
జనగణన విధుల్లో 75 శాతం మంది
జిల్లాలోని ఉపాధ్యాయులు జూన్ 9 వరకు జనగణన విధులు నిర్వహించనున్నారు. ఇదే సమయంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేలా షెడ్యూల్ ఉండడంతో ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారు. సుమారు 75 శాతం ఉపాధ్యాయులు జనగణనలో విధులు నిర్వహిస్తుండగా మిగిలిన 25 శాతం మంది ఉపాధ్యాయుల్లో కొందరు అదనంగా రెండు విధులను కేటాయించారు. ఒకే సమయంలో రెండు విధులు ఎలా నిర్వహించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను ప్రధానోపాధ్యాయులకు విన్నవిస్తుండడంతో వారు కూడా సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.
ఫ జనగణనకు 75 శాతం మంది టీచర్లు
ఫ మిగిలింది 25 శాతం మందే..
ఫ నామమాత్రంగా బడిబాట కార్యక్రమాలు
ఫ లక్ష్యం పూర్తిపై అనుమానాలు


