ఆలేరు : రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను అతడి తల్లిదండ్రులు దానం చేసి మరో ఐదుగురికి ప్రాణం పోశారు. వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన శ్రీసాహిత్ ఎంబీబీఎస్ చదువుతుండగా.. పులిపలుపుల రాఘవభార్గవగౌడ్(19), అక్షయ్‌చారి బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. వీరు ముగ్గురు స్నేహితులు. వీరు ముగ్గురు ఈ నెల 16న రాత్రి సిద్దిపేట నుంచి ద్విచక్ర వాహనంపై ఆలేరుకు వస్తుండగా.. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ శివారులో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థి శ్రీసాహిత్ మృతి చెందగా.. రాఘవభార్గవగౌడ్, అక్షయ్‌చారి తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్పించారు. అక్షయ్‌చారి వైద్య చికిత్స అనంతరం కోలుకోగా.. రాఘవభార్గవగౌడ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతడిని బతికించేందుకు రెండు రోజులుగా వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. రాఘవభార్గవగౌడ్ ప్రాణాలు దక్కే పరిస్థితి లేనందున.. అతడి అవయవాలు దానం చేసేందుకు సోమవారం అతడి తల్లిదండ్రులు ముందుకొచ్చి మరో ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
మరో ఐదుగురికి కొత్త జీవితం
ప్రసాదించిన మృతుడి తల్లిదండ్రులు


