చౌటుప్పల్ : ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న దొంగను చౌటుప్పల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ గరిసె రామస్వామి ఈ నెల 1వ తేదీన చౌటుప్పల్‌కు వచ్చాడు. స్థానిక ఎల్లప్ప హోటల్ భవనం సెల్లార్‌లో తన స్కూటీని పార్కింగ్ చేసి పనిమీద వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం వచ్చి చూడగా స్కూటీ కనిపించలేదు. దీంతో అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా.. శనివారం ఉదయం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ క్రాస్ రోడ్డులో ఎస్‌ఐ యాదగిరి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటుగా వచ్చిన నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన పందుల విష్ణువర్ధన్ అలియాస్ చింటు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. అతడిని వెంబడి పట్టుకుని విచారించగా.. ఎల్లప్ప హోటల్ భవనం సెల్లార్‌లో పార్కింగ్ చేసిన స్కూటీతో పాటు మరో రెండు ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. అతని నుంచి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరుపర్చి నల్లగొండ జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.


