యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర నుంచి మూడు గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. సుమారు 35వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఈఓ భవానీ శంకర్ సూచించారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.38,79,801 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
స్వాతి నక్షత్ర పూజలు..
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని శనివారం విశేష పూజలు జరిగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు ముఖ మండపంలో స్వాతి హోమాన్ని జరిపించారు. అనంతరం బంగారు, వెండి కలశాలకు పూజలు చేసి, స్వామి, అమ్మవార్లకు శతఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో గజ వాహన సేవ, నిత్య కల్యాణం వేడుకను వైభవంగా జరిపించారు. భక్తులు యాదగిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఆయా వేడుకల్లో ఈఓ భవానీ శంకర్, ఆలయాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
35 వేలకు పైగా దర్శించుకున్న భక్తులు


