ధాన్యం ధర తగ్గించి దగా | - | Sakshi
Sakshi News home page

ధాన్యం ధర తగ్గించి దగా

Apr 2 2026 7:11 AM | Updated on Apr 2 2026 7:11 AM

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

మిర్యాలగూడ : సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలోని మిల్లర్లు రైతులను నిలువునా ముంచుతున్నారు. ఆయకట్టు ప్రాంతంలో కోతలు మొదలైన సమయంలో (పదిరోజుల క్రితం) క్వింటా ధాన్యం ధర రూ.2750 ఉంటే.. మిల్లర్లు సిండికేట్‌గా మారి రోజుకు కొంత తగ్గిస్తూ ఇప్పుడు రూ.2,400 లోపే ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే వారి ధాన్యంలో కొర్రీలు పెట్టి అసలే కొనుగోలు చేయడం లేదు. ఇప్పటికే దిగుబడి తగ్గి ఇబ్బందులు పడుతున్న అన్నదాతలను ధాన్యం ధర తగ్గించి మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు.

ఆయకట్టులో సన్నాల సాగు

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 3.5 లక్షరాల్లో రైతులు సన్నాలు సాగు చేశారు. ఈ యాసంగి సీజన్‌లో రైతులు కావేరి, జేఎస్‌ఆర్‌, హెచ్‌ఎంటీ వంటి సన్న రకాలను సాగు చేశారు. పదిరోజుల క్రితం కోతలు మొదలయ్యాయి. తెగుల ప్రభావంతో ఎకరాకు 30 నుంచి 35 బస్తాలలోపే దిగుబడి వస్తోంది. ఒకటిరెండు రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా వర్షం కురుస్తుండడంతో రైతుల ఆందోళన చెంది ఒకేసారి పొలాలు కోస్తున్నారు. దీంతో మిల్లులకు ధాన్యం పోటెత్తుతోంది.

కొనుగోలుకు కొర్రీలు..

ధాన్యం తెచ్చిన రైతును ఉదయం నుంచి సాయంత్రం వరకు మిల్లుల వద్ద పడిగాపులు కాయించి తీరా పచ్చగింజ, తాలు పేరుతో ధరలో కోత పెడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఆయకట్టులో ఇప్పటి వరకు 25 శాతం మేర కోతలు అయ్యాయి. ఇప్పుడే ధర తగ్గిస్తే భవిష్యత్‌లో ఇంకా ధర కోత పెట్టే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో కూడా మిల్లర్లకు కలిసివస్తోంది. ప్రభుత్వ కేంద్రాల్లో 17 శాతం తేమ ఉంటే మద్దతు ధర రూ.2389, సన్నాలకు బోనస్‌ రూ.500 చెల్లిస్తారు. దీంతో క్వింటాకు రూ.2,889 రైతుకు గిట్టుబాటు అవుతుంది. కానీ మిల్లుల్లో ఎక్కడా అంత ధరపెట్టి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. మిల్లుల్లో ధర లేకపోతే రైతులు ధాన్యం ఆరబోసి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేవారు. కానీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో మిల్లర్లు చెప్పిన రేటుకే ధాన్యం అమ్ముకుని రైతులు నష్టపోతున్నారు.

గుమస్తాలు, కమీషన్‌దారుల ఇష్టారాజ్యం

మిల్లుల్లో గుమస్తాలు, కమీషన్‌దారుల ఇష్టారాజ్యం సాగుతోంది. వీరు మిలాకత్‌ అయి రైతులను ముంచుతున్నారు. రైతుల తెచ్చిన ధాన్యానికి తొలుతు కమీషన్‌ దారుడు ఓ రేటు వేసి మిల్లుకు పంపిస్తున్నాడు. అక్కడ మిల్లుల్లో గుమస్తాలు కమీషన్‌దారుడు చెప్పిన రేటుకు కొంత తగ్గించి కొనుగోలు చేస్తాడు. కానీ, ఎవరైనా రైతు నేరుగా మిల్లుకు ధాన్యం తెస్తే వారి ధాన్యం బాగోలేదని కొనుగోలు చేయకుండా నిరాకరిస్తున్నారు. అదే ధాన్యాన్ని అమ్ముకునేందుకు గత్యంతరం లేక రైతు కమీషన్‌దారుడిని ఆశ్రయిస్తే వారు చెప్పిన మిల్లులో వెంటనే కొనుగోలు చేస్తున్నారు. ఇలా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో చాలా మంది కమీషన్‌దారులుగా చలామనీ అవుతున్నారు.

పెద్ద మిల్లులదే హవా..

మిర్యాలగూడ పరిసరాల్లో సుమారు వందకు పైగా రైస్‌ మిల్లులు ఉన్నాయి. ఇక్కడి నుంచి బియ్యం ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఉన్న ఓ పది పెద్ద మిల్లులే ధరను నిర్ణయిస్తున్నాయి. ధర తగ్గించాలన్నా.. పెంచాలన్నా.. వారిదే పెత్తమని చిన్న మిల్లుల యాజమాన్యం వాపోవడం గమనార్హం. పెద్ద మిల్లుల యాజమాన్యం సిండికేట్‌ అయి ధరలను అదుపు చేస్తున్నారని తెలుస్తోంది.

సాగర్‌ ఆయకట్టులో

మిల్లర్ల దోపిడీ

ఫ మేం చెప్పిన రేటుకే అమ్మండి...

లేకుంటే పోండి అంటూ బెదిరింపులు

ఫ పది రోజుల క్రితం

క్వింటా ధర రూ.2,750..

ఇప్పుడు రూ.2,400 లోపే..

ఫ దిగుబడి లేక.. ధర రాక

దిగాలు చెందుతున్న అన్నదాతలు

మిల్లర్లు సిండికేట్‌గా మారకముందే రైతులకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ధర నిర్ణయించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. క్వింటాకు రూ.2,350కే కొనుగోలు చేయడంతో కొందరు రైతులు.. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రైతులకు జరుగుతున్న నష్టాలపై వామపక్ష నాయకులు, రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టి సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement