సాక్షి, యాదాద్రి : యాసంగి సీజన్ 2025–26కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 330 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి వెల్లడించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో కలిసి నిర్వహించిన సన్నాహక సమావేశంలో వెంకారెడ్డితో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడారు. కేంద్రాలలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలన్నారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులందరూ టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డ్రై మిషన్, ప్యాడీ క్లీనర్స్, వేయింగ్ మిషన్, మాయిశ్చర్ మిషన్లు, గన్నీ బ్యాగులు ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మంచినీరు, టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. వరి ధాన్యం క్వింటాకు ‘ఏ’ గ్రేడ్ కు రూ.2,389, సాధారణ రకం క్వింటాకు రూ.2,369 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారిణి రోజారాణి, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ హరికృష్ణ, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీసీఓ మురళి, డీఏఓ రమణా రెడ్డి పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి


