కేతేపల్లి : కేతేపల్లి మండలం బండపాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో కల్యాణ వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బండపాలెంలో సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు నిర్వాహకులు సెంట్రింగ్ చెక్కలతో స్టేజీ నిర్మించి దానిపై కల్యాణ మండపం ఏర్పాటు చేశారు. కల్యాణ తంతు పూర్తయిన తర్వాత తలంబ్రాలు సమర్పించేందుకు మహిళలు ఒక్కసారిగా స్టేజీ పైకి ఎక్కారు. దీంతో కల్యాణ వేదిక కుప్పకూలింది. స్టేజీపై ఉన్న పూజా సామగ్రి చిందవందరగా పడిపోయింది. అర్చకులు ఉత్సవమూర్తుల విగ్రహాలను జాగ్రత్తగా పట్టుకోవటంతో పెనుప్రమాదం తప్పింది. ఏం జరుగుతుందో తెలియక భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు మహిళలు, చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు.


