అంతర పంటలతో రైతుకు అదనపు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

అంతర పంటలతో రైతుకు అదనపు ఆదాయం

Mar 28 2026 7:15 AM | Updated on Mar 28 2026 7:15 AM

హాలియా: జిల్లాలో పండ్ల తోటల సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూనే ఉంది. వివిధ పండ్ల తోటల్లో మొక్కలు నాటిన తర్వాత కాపునకు వచ్చే 4–5 సంవత్సరాల వరకు అంతర పంటలుగా మునగ, చిక్కుడు జాతి పంటలు, వేరుశనగ, పెసర, మినుము, కూరగాయలు, పుచ్చ సాగు చేసుకుంటే అదనపు ఆధాయం పొందే అవకాశం ఉంటుంది. పండ్ల తోటల్లో అంతర పంటల సాగుపై అనుముల ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారి మురళి అందిస్తున్న సలహాలు ఆయన మాటల్లోనే...

అంతర పంటలతో లాభాలు

ఫ పండ్ల తోటల్లో మొక్కలను ఎక్కువ దూరంలో నాటడం, ఎక్కువ నీటి తడులు ఇవ్వడం వల్ల భూమిలో కలుపు పెరిగే అవకాశం ఉంది. అంతర పంటలు కలుపును నివారిస్తాయి.

ఫ సహజ వనరులైన భూమి, నీరు, సూర్యరశ్మి సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు.

ఫ వివిధ రకాల అంతర పంటల సాగు వల్ల నేలలో వివిధ లోతుల్లో తేమ, పోషక పదార్ధాలు క్రమబద్ధంగా ఉపయోగపడటమే కాకుండా నేల లోపలి వరకు గుల్లబారి తర్వాత పంటలు బాగా పెరగటానికి దోహదపడుతుంది.

ఫ ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు ఒకే సమయంలో పండించడం వల్ల రైతులకు రాబడులు స్ధిరంగా ఉంటాయి.

ఫ అంతర పంటలుగా అపరాలు సాగు చేసుకుంటే భూసారం అభివృద్ధి చెందుతుంది.

వేసుకోదగ్గ అంతర పంటలు

మామిడిలో..

నేల లోతు, ఎంపిక చేసుకునే రకాన్ని బట్టి మామిడి మొక్కలను 7–10 మీటర్ల దూరంలో నాటుతారు. కాబట్టి మొక్కల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది. లేత తోటల్లో సూర్యరశ్మి, గాలి ప్రసారం బాగా ఉంటుంది. ఇందులో అంతర పంటలుగా కూరగాయలు, తక్కువ ఎత్తు పెరిగే బొప్పాయి, మునగ లాంటి మొక్కలు వేసుకోవచ్చు. పెద్ద తోటల్లో నీడలో పెరిగే అల్లం, పసుపు అంతర పంటలుగా వేసుకోవచ్చు. దీర్ఘకాలంలో ఆదాయానిచ్చే ఎర్రచందనం, శ్రీగంధం కూడా సాగు చేసుకోవచ్చు.

బత్తాయి, నిమ్మలో..

బత్తాయి, నిమ్మ మొక్కలను 7్ఙశ్రీ7 మీటర్ల దూరంలో నాటుతాం. కాబట్టి కాపునకు వచ్చే ఐదు సంవత్సరాల వరకు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. వేరుశనగ, కంది, మినుము, పెసరతో పాటు దోస, ఉల్లి, పుచ్చ పంటలు వేసుకోవచ్చు. మిరుప, టమాట, వంగ పైర్లు వేయకూడదు. ఈ పైర్లు వేయడం వల్ల నులిపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.

సపోటాలో..

సపోటాను కూడా 7్ఙశ్రీ7 మీటర్ల దూరంలో నాటుకోవడం వల్ల అంతర పంటలుగా బొప్పాయి, మునగ లాంటి పంటలు వేసుకోవచ్చు. అలాగే కూరగాయల పంటలైన టమాట, వంగ, దోస కూడా సాగుచేయవచ్చు. చెట్ల వరుస మధ్యలో కొందరు ఎర్రచందనం, శ్రీగంధం కూడా సాగు చేస్తున్నారు.

బిందు సేద్యం ద్వారా అంతర పంటల సాగు

పండ్ల తోటల్లో అంతర పంటల సాగులో కొన్ని మెళకువలు పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా డ్రిప్‌ ద్వారా నీరందించినప్పుడు అంతర పంటల సాగుకు ప్రత్యేకంగా లాటరల్‌ పైపులైన్‌ వేసుకోవాలి. దీని ద్వారా ప్రధాన పంటకు, అంతర పంటకు వేర్వేరుగా సరిపడా నీరు అందించవచ్చు.

ఫ అనుముల ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారి మురళి సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement