భువనగిరిటౌన్ : ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. కానీ, చాలా మంది ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో చివరి నిమిషం వరకు చూసుకోరు. తీరా పోలింగ్ రోజు ఓటరు జాబితాలోని పేర్లు, ఆధార్, ఇతర ప్రభుత్వ పత్రాలతో సరిపోలని సందర్భంలో ఓటు వేయకుండా వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వ్యత్యాసాలను తొలగించి, పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు ఎన్నికల సంఘం పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. దీంట్లో భాగంగా వచ్చె నెల మొదటి వారంలో స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో బీఎల్‌వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
వయస్సును బట్టి నిబంధనలు మార్పు
వయస్సును బట్టి నిబంధనలు మారుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం మీరు ఏ సంవత్సరంలో జన్మించారు అనే అంశంపై మీరు సమర్పించాల్సిన పత్రాలపైనే ఆధారపడి ఉంటుంది.
సీనియర్లు (1987కంటే ముందు పుట్టిన వారు)
వీరికి ప్రక్రియ సులభం. తమ పుట్టిన తేదీని తెలిపే ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది.
మధ్య వయస్కులు
(1987–2004 మధ్య పుట్టిన వారు) :
వీరు తమ పత్రాలతో పాటు, తమ తండ్రి లేదా తల్లిలో ఒకరి బర్త్ ప్రూఫ్ సమర్పించాలి. అప్పుడే వారి పౌరసత్వ ధ్రువీకరణ పూర్తవుతుంది.
యువ ఓటర్లు
(2004 డిసెంబర్ తర్వాత పుట్టిన వారు) :
వీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తమ సొంత పత్రాలతో పాటు, తల్లి, తండ్రి ఇద్దరి పుట్టిన తేదీ ఆధారాలను జత చేయాల్సి ఉంటుంది.
సర్వే సమయంలో ఉండాల్సిన పత్రాలు
బీఎల్‌వోలు ఓటర్లకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారం నింపేటప్పుడు ఈ కింది పత్రాల జిరాక్స్ కాపీలపై మీ సంతకం చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందులో ఆధార్ కార్డు (అత్యంత కీలకం), పదవ తరగతి మార్కుల జాబితా (వయస్సు నిర్ధారణకు), నివాస ధ్రువీకరణ పత్రం లేదా ఇంటి పన్ను రసీదులు, కుల ధవీకరణ పత్రం (వర్తిస్తే) అందుబాటులో ఉంచుకోవాలి. సరైన పత్రాలు లేకపోతే ఓటు హక్కు పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది.
మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు
ఎన్యుమరేషన్ ఫారం నింపడంపై
మార్గదర్శకాలు విడుదల
ఇప్పటికే బీఎల్‌ఓలకు శిక్షణ
బీఎల్‌ఓలు ఇచ్చే ఫాంలో ఉండే అంశాలివే..
వ్యక్తిగత వివరాలు : పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్.
కుటుంబ సభ్యుల వివరాలు : తండ్రి పేరు, తల్లి పేరు లేదా జీవిత భాగస్వామి (భార్య/భర్త) పేరు మరియు వారి ఓటరు కార్డు (ఇపిక్) నంబర్లు.
మునుపటి ఓటరు వివరాలు : ఒకవేళ మీరు ఇదివరకే వేరే చోట ఓటరుగా ఉంటే, ఆ పాత నియోజకవర్గం, ఓటరు కార్డు వివరాలు ఇక్కడ రాయాలి.
డిక్లరేషన్ (ధ్రువీకరణ) ఇలా..
నేను భారత పౌరుడిని. నా పేరు మరెక్కడా ఓటరు జాబితాలో లేదు. నేను ఇచ్చిన సమాచారం తప్పని తేలితే శిక్షకు అర్హుడనని ఒప్పుకుంటున్నాను.
మీరు చేయాల్సినవి..
ఫోటో: కుడి వైపుపైన ఉన్న బాక్స్‌లో మీ ప్రస్తుత పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించాలి.
సంతకం : ఫారమ్ కింద ఎడమ వైపున అని ఉన్నచోట మీ సంతకం లేదా ఎడమ చేతి వేలిముద్ర వేయాలి.
కుటుంబ సభ్యుని సంతకం : మీ కుటుంబంలోని మరొక పెద్ద వ్యక్తి సంతకం కూడా అవసరం అవుతుంది. ఈ ఫారమ్‌ను పూర్తిగా నింపిన తరువాత మీ ప్రాంతంలో బూత్‌లేవల్ అధికారికి అందజేయాలి.


