నల్లగొండ టూటౌన్: ఎడ్యునేట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మార్తో – 2026లో ఎంజీయూ బీటెక్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొత్తం 560 ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంచగా.. 29 టీమ్‌లు ఫైనల్‌కు ఎంపికయ్యాయి. నల్లగొండ ఎంజీయూ విద్యార్థులు ఎం. జయంతి పర్యవేక్షణలో ‘సెక్యూర్ గ్రాఫ్ క్రిప్టో సిస్టమ్ ఏ డీఎస్‌ఏ డ్రివెన్ మల్టీలేయర్ ఎన్‌స్క్రిప్షన్ ఫ్రేమ్ వర్క్’ అనే అంశంపై రూపొందించిన ప్రాజెక్టు ఫైనల్‌కు ఎంపికై ంది. ఈమేరకు బీటెక్ సీఎస్‌సీ మూడవ సంవత్సరం విద్యార్థులు కొనడా సాంబప్రసాద్‌రెడ్డి, కార్తిక్, మాదిహ షాకూర్, మానసలను వీసీ అల్తాఫ్ హుస్సేన్ బుధవారం అభినందించారు.
కోదాడవాసికి రాష్ట్రస్థాయి
ద్వితీయ బహుమతి
కోదాడ: తపాలాశాఖ ‘డాయి ఆఖర్’ కార్యక్రమంలో భాగంగా లెటర్ టు మై రోల్ మోడల్ అనే అంశంపై సెప్టెంబర్ 2025 నుంచి డిసెంబర్ వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన లేఖల పోటీల్లో కోదాడ రచయితల సంఘం అధ్యక్షుడు పుప్పాల కృష్ణమూర్తి రాష్ట్ర స్థాయిలో ద్వితీయస్థానం సాధించాడు. ఈమేరకు ఆయనకు రూ.10వేలు నగదు పురస్కారాన్ని తపాలశాఖ అందించనుంది. విజేతగా నిలిచిన కృష్ణమూర్తిని పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య, కోదాడ సంఘం అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, రఘువరప్రసాద్, మారంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు అభినందించారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తికి తీవ్రగాయాలు
మునగాల: మండల పరిధిలోని నేలమర్రిలో బుధవారం ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. గ్రామానికి చెందిన కాంపాటి సైదులు(50) తన వరి చేను పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగ్రాత్రుడికి ప్రాఽథమిక చికిత్స అందించి సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
చాంపియన్ ఫార్మర్‌గా
పోలేపల్లి వాసి
చందంపేట : మండలంలోని పోలేపల్లి గ్రామ రైతు లోకసాని పద్మారెడ్డికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఘజియాబాద్‌లోని ‘నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్’లో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించిన సెమినార్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘చాంపియన్ ఫార్మర్’ అవార్డును ప్రదానం చేసింది. తన 12 ఎకరాల పొలంలో కుంకుడు సాగు చేస్తూ పద్మారెడ్డి దేశవ్యాప్త గుర్తింపు పొందారు. ఈ సెమినార్‌లో ఆయన మాస్టర్ ట్రైనర్‌గా వ్యవహరించి సాగు మెళకువలను వివరించారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా బత్తాయి, జామ, కుంకుడు, ఉసిరి, సీతాఫలం, కొబ్బరి తోటలను సాగు చేస్తున్న ఆయన కృషిని గుర్తించి కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈ పురస్కారాన్ని అందజేసింది.


