వలిగొండ : పేదలు నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం నిషేధిత జాబితా 22–ఏ నుంచి తొలగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వలిగొండ మండలం వేములకొండలో శనివారం నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 17 మండలాల్లోని 422 గ్రామ పంచాయతీలు, ఆరు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం నిషేధిత జాబితాను రూపొందించడం దారుణ చర్య అన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యతో భూముల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు నిలిచిపోయి పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే నిషేధిత జాబితాను రద్దు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు ఎలగందుల అంజయ్య, ఎల్లంకి మహేష్,నరిగే యాదయ్య, బొడిగ సుదర్శన్, యాస జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


