● కుంటలో మునిగి రైతు మృతి
నూతనకల్ : ఎద్దులను కడిగేందుకు కుంట వద్దకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నూతనకల్ మండలం పెదనెమిల గ్రామంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దనెమిల గ్రామానికి చెందిన నాగెల్లి రామస్వామి(60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా తన ఎద్దులను కడిగేందుకు గ్రామ శివారులోని ముత్యాలమ్మ కుంట వద్దకు తోలుకెళ్లాడు. ఎద్దులను శుభ్రం చేసి కుంట నుంచి బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తు కుంటలో మునిగి పోయాడు. పక్కనే ఉన్న దేవాలయానికి వచ్చిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్ల సహకారంతో రామస్వామి మృతదేహాన్ని కంటలో నుంచి బయటకు వెలికితీశారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు విక్రమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
27 నుంచి
శ్రీమహాలక్ష్మి యాగం
మిర్యాలగూడ : పట్టణంలోని ఎన్‌ఎస్పీ క్యాంప్ గ్రౌండ్‌లో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో శ్రీమహాలక్ష్మి యాగం నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం మిర్యాలగూడ పట్టణంలో యాగం కరపత్రాన్ని నిర్వాహకులు ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 27 నుంచి ప్రతిరోజు ఉదయం 7గంటలకు తీర్థ గోష్ఠి, అనంతరం యజ్ఞ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారు యాగ ప్రాంగణంలో బిక్ష స్వీకరిస్తారని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం యజ్ఞశాలలో నిత్య పూర్ణాహుతి, యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అమ్మవారి యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, జిల్లా నాయకుడు బండారు కుశలయ్య, ఉపాధ్యక్షులు గోళ్ల రామశేఖర్, పొలిశెట్టి ధనుంజయ, కోశాధికారి గందె రాము, బీజేపీ నాయకుడు పురుషోత్తంరెడ్డి, న్యాయవాది గూడూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


