దంతూర్‌ గ్రామంలో విషాదఛాయలు | - | Sakshi
Sakshi News home page

దంతూర్‌ గ్రామంలో విషాదఛాయలు

Mar 20 2026 9:21 AM | Updated on Mar 20 2026 9:21 AM

భూదాన్‌పోచంపల్లి : మండలంలోని దంతూర్‌ గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త శ్రీనివాస్‌ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అన్నోజిగూడలో చోటుచేసుకుంది. మృతుడి భార్య సౌజన్య తెలిపిన వివరాల ప్రకారం.. దంతూర్‌ గ్రామానికి చెందిన బోదాసు శ్రీనివాస్‌ (37) హైదరాబాద్‌లోని సాయి లైఫ్‌ సైన్సెస్‌ సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో అన్నోజిగూడలో నివాసం ఉంటున్నాడు. కాగా, ఆయనకు సొంతూరులో వ్యవసాయ భూమి ఉంది. ఇదే గ్రామానికి చెందిన బోదాసు నర్సింహ, సిద్దగోని మల్లయ్య, కంబాలపల్లి నర్సింహ, బోదాసు చిన్న ఈదయ్య, బోదాసు బాలరాజు, బోదాసు యాదయ్య కలిసి పొలం బాట ఉందని తప్పుడు పత్రాలను సృష్టించి తమ భూమిని ఆక్రమించుకున్నారని సౌజన్య ఆరోపించారు. ఇదే విషయమై పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని, దీంతో కోర్టుకు వెళితే ఇంజక్షన్‌ ఆర్డర్‌ వచ్చిందని తెలిపారు. అయినా, తన భర్తపై తప్పుడు కేసులు బనాయిస్తూ మానసికంగా వేధించారని ఆరోపించారు. కాగా, రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి బెడ్‌రూమ్‌లో పడుకున్న శ్రీనివాస్‌ మానసిక క్షోభతో అర్ధరాత్రి ఇంటి హాల్‌లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్ల వారు జామున హాల్‌లోకి వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడని సౌజన్య తెలిపారు. తన భర్తకు చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఆమె ఫిర్యాదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని దంతూర్‌ తీసుకొచ్చారు. కాగా, మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సూసైడ్‌ నోట్‌ లభ్యం

కాగా, శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకొనే ముందు రాసిన సూసైడ్‌ నోట్‌ లభించింది. వ్యవసాయ బాట లేకున్నా.. ఉన్నట్లు తప్పుడు సాక్ష్యాలతో తన భూమిని కబ్జా చేసి మానసికంగా వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని నోట్‌లో పేర్కొన్నాడు. తన ఆత్మకు శాంతి చేకూరాలంటే తన శవాన్ని కబ్జా చేసిన బాటలో పూడ్చాలని రాశాడు. తప్పుడు సాక్ష్యాలతో తనను ఇబ్బంది పెట్టారని, పోలీసులు కూడా విచారణలో పారదర్శకత పాటించలేదని నోట్‌లో పేర్కొన్నాడు.

భూ వివాదంతో హైదరాబాద్‌లో

ఆత్మహత్య చేసుకున్న గ్రామవాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement