శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైన అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో గురువారం మహా శివరాత్రి ఉత్సవాలకు ఆచార్యులు, పండితులు శ్రీస్మార్త ఆగమ ప్రకారం పాంచాహ్నిక దీక్షతో శ్రీకారం చుట్టారు. ఉదయం 10.30గంటలకు ఆలయ మండపంలో స్వస్తీ వాచనం, విఘ్నేశ్వరపూజ, శుద్ధి పుణ్యాహ వాచనం, రక్షా బంధనం కార్యక్రమాలను యజ్ఞ బ్రహ్మ ఆధ్వర్యంలో ఆలయ సిద్ధాంతి, ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకులు, పురోహితులు నిర్వహించారు. పారాయణీకులకు అధికారులు దీక్ష వస్త్రాలు అందజేశారు.
స్వస్తీ వాచనం..
యాదగిరీశుడి ఆలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరస్వామి వారి ప్రధానాలయంలో సిద్ధాంతి, యజ్ఞ బ్రహ్మలు అత్యంత వైభవంగా వేడుకలను ప్రారంభించారు. ఈశ్వర అనుగ్రహం వల్ల విశ్వశాంతి, లోక హితం కలగడానికి ఈ స్వస్తీ వాచనం చేపట్టారు. ఇక ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగడానికి విఘ్నేశ్వర ఆరాధన చేపట్టారు. అనంతరం వేద మంత్ర పఠనంతో పవిత్ర జలంతో పూజా ద్రవ్యములను, ఆలయ పరిసర ప్రాంతాలను సంప్రోక్షణ చేసి పుణ్యాహవాచన కై ంకర్యాన్ని నిర్వహించారు. ఈ వేడుకలను జరిపిన తరువాత పార్వతీ పరమేశ్వరులకు రక్షా బంధనం వేడుకను స్మార్త ఆగమ ప్రకారం చేపట్టారు.
సాయంత్రం..
సాయంత్రం వేళ శివాలయంలో నమక, చమక పారాయణం, మంత్ర పుష్ప పఠనం చేశారు. అనంతరం అంకురారోపణం, సోమ కుంభ, కలశ స్థాపన, దేవతారాధన, తీర్థ ప్రసాద వితరణ వంటి వేడుకలు నిర్వహించారు. ఆయా వేడుకల్లో ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఫ ఉదయం స్వస్తీ వాచనం.. రాత్రి అంకురారోపణం


