తెలంగాణలోకి చేరుకున్న దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : కర్ణాటక రాష్ట్రంలోని కలబురగలో ఈ నెల 1న ప్రారంభమైన దమ్మ పాదయాత్ర సోమవారం తెలంగాణలోని మడిగి ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి మంగళవారం బుచ్చినెల్లికి చేరుకుంది. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఈ పాదయాత్రలో పాల్గొనే వారు ఈ నెల 18న హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో బుద్ధవిగ్రహాన్ని సందర్శించి అనంతరం మహాబోధి బుద్ధ విహార్‌కు చేరుకొని 19న అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. మార్చి 1న నాగార్జునసాగర్‌కు చేరుకొని రెండో తేదీన నాగార్జునసాగర్ మ్యూజియాన్ని సందర్శించి, 3న బుద్ధవనంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వివరించారు. ఈ పాదయాత్రలో యాత్ర సంఘా ప్రాజెక్ట్ డైరెక్టర్ సొంగషాక్ కోవిడో, థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు, గగన్‌మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు గగన్ మాలిక్, కేకే రాజా, మూర్తి, సిద్ధోజి, బుద్ధవనం ఆర్ట్స్ ప్రమోషన్ మేనేజర్ శ్యాంసుందర్‌రావు, కిషోర్ ఉన్నారు.


