నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది
గుర్రంపోడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లినవె దంపతులను ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది.. క్షతగాత్రుల వద్ద లభించిన రూ.లక్షన్నర నగదును వారి బంధువులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. వివరాలు.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నివాసముంటున్న ఓర్సు రాంబాబు, నాగమణి దంపతులు సోమవారం కారులో పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేటలో బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి తిరిగి వారి స్వగ్రామమైన కనగల్ మండలం కురంపల్లికి వెళ్తుండగా.. మార్గమధ్యలో గుర్రంపోడు మండలం జూనూతల గ్రామ స్టేజీ వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాంబాబు, నాగమణి దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 108 ఈఎంటీ వెలుగు సత్యనారాయణ, పైలెట్ మారేపల్లి వెంకటేశ్వర్లు క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా క్షతగాత్రుల వద్ద ఉన్న రూ.లక్షన్నర నగదును మంగళవారం రాంబాబు బంధువైన అంజికి ఆస్పత్రిలో అందించి నిజాయితీ చాటుకున్నారు.


