సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
ఆలేరు: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆలేరు బాలుర ఉన్నత పాఠశాలలోని 7, 12 వార్డులకు చెందిన పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మున్సిపల్ పోలింగ్‌కు పకడ్బందీ పోలీసు బందోబస్తు చేశామన్నారు. ఆరు మున్సిపాలిటీల్లో 36 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఆర్మ్‌డ్ బలగాలను నియమించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు, ప్రత్యేక బలగాలు బందోబస్తు నిర్వహిస్తామన్నారు. ఎస్పీ వెంట ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, సీఐ యాలాద్రి, ఎస్‌ఐ వినయ్ ఉన్నారు.
సెల్‌ఫోన్లు
అనుమతించొద్దు
మోత్కూరు : మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ కేంద్రాలకు సెల్‌ఫోన్లు అనుమతించొద్దని అదనపు కలెక్టర్ ఎం.భాస్కర్‌రావు అన్నారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి గుర్రం సురేష్, మున్సిపల్ కమిషనర్ కె.సతీష్‌కుమార్, తహసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో బాలాజీనాయక్, ఎంపీవో పైళ్ల జనార్దన్‌రెడ్డి, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్, పంచాయతీరాజ్ డెప్యూటీ ఈఈ మంగులాల్ ఉన్నారు.
ఆర్థిక అక్షరాస్యత వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
భువనగిరిటౌన్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల – 2026 వాల్‌పోస్టర్లను కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కరరావు మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ రామ కృష్ణ, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు
యూరియా కోసం రైతుల నిరసన
వలిగొండ : యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని వివిధ దుకాణాల్లో యూరియా నిల్వలు ఉన్నాయని రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం, వలిగొండతోపాటు వివిధ గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈలోపే యూరియా నిల్వలు లేవని తెలియడంతో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ పెట్టి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించి ధర్నా విరమింపజేశారు.
స్వరగిరీశుడికి సూర్యప్రభ వాహనసేవ
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అళ్వార్ తిరునగరి ఎంమేరు మనార్ జీయర్ మఠం శ్రీరంగరామానుజ జీయర్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆయనకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు స్వాగతం పలికారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి


