ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మున్సిపాలిటీలోని 4, 6, 8వ వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని అన్ని వార్డుల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు. 12 వార్డుల్లో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలన్నారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రజా పాలనలో ప్రతి నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలతో పాటు మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఇప్పటికే యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 10వ వార్డు ఏకగ్రీవమైందని, మిగిలిన 10 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో సీపీఐ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రజల్లో తమకు వస్తున్న ఆధరణ చూసి ఓర్వలేక ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


