ఎన్నికలు తెచ్చిన ఉపాధి
పాటకు రూ.15వేలు
హోటళ్లకు తాకిడి
భువనగిరి, నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ ఎన్నికలు పేదలకు, కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా నిత్యం తమ వెంట వందల మంది జనాన్ని తిప్పుకుంటూ వార్డుల్లో బలప్రదర్శన నిర్వహిస్తున్నారు. డప్పు కళాకారులు, కోలాటం ఆడేవారు ర్యాలీల్లో ముందుంటున్నారు. దాంతో పాటు ఆటోలు, వాహనాల్లో స్పీకర్లు పెట్టి తమ కోసమే రూపొందించిన పాటలతో మరీ ప్రచారం చేపడుతున్నారు.
అభ్యర్థి వెంట వందల మంది ఉంటే ఇక అతడి గెలుపు పక్కా అనే ప్రచారం జరగాలనే వ్యూహంతో కొందరు అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన పేదలను తమ వెంట తిప్పుకుంటున్నారు. రోజులో ఒక పూట వెంట తిరిగితే భోజనంతో పాటు రూ.250, రెండు పూటలు తిరిగితే భోజనంతో పాటు రూ.500 ఇస్తున్నారు. అభ్యర్థుల వెంట జనం లేకపోతే ఓడిపోతారనే ప్రచారం చేస్తారనే భయంతో అభ్యర్థులు రోజు ఐదు వందలకు పైగానే మందిని తమ వెంట తిప్పుకుంటూ కాలనీల్లో హంగామా చేస్తున్నారు
ఎన్నికల సందర్బంగా కారు, ఆటోలకు సైతం గిరాకీ ఏర్పడుతోంది. బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు నాయకులు కార్యకర్తలను ఆయా వార్డుల్లో తీసుకెళ్లడానికి వాహనానలు వినియోగిస్తున్నారు. వాహనాలకు ఫ్లెక్సీలు, మైకులు ఏర్పాటు చేసి గల్లీల్లో తిప్పుతున్నారు. దాంతో ప్రైవేటు వాహనదారులకు డిమాండ్ పెరిగింది.
పట్టణాల్లో మైక్ ద్వారా ప్రచారానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. దాంతో అభ్యర్థులు తమ పేరు, పార్టీతో ప్రత్యేకమైన పాటను రూపొందించుకొని, సింగర్‌తో పాడించుకొని కాలనీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పాటలు సామాజిక మాధ్యమాలతో పాటు ఆటోలకు మైక్ బిగించి కాలనీలల్లో గల్లీ, గల్లీ తిప్పుతున్నారు. ఒక్కో పాటకు రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు గాయకులకు చెల్లించినట్లు తెలిసింది. దీని ద్వారా గాయకులకు ఉపాధి లభిస్తోంది.
సభలు, సమావేశాలు, ప్రచారానికి వేళ్లేటప్పుడు నాయకులు, కార్యకర్తలు ఉదయం అల్పహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. దాంతో పట్టణాలలో హోటల్స్‌కు గిరాకీ పెరిగింది. కొందరు క్యాటరింగ్, హోటల్స్ వారికి ఆర్డర్స్ ఇస్తూ కోరిన చోటుకు పార్సిల్స్ కట్టి తీసుకెళ్తున్నారు. మరి కొందరు ఏకంగా హోటల్స్‌తో ముందుగానే కాంట్రాక్ట్ మాట్లాడుకొని కార్యకర్తలకు టోకెన్లు అందిస్తున్నారు. దాంతో అన్ని హోటళ్లు ఆర్డర్లతో యమ బిజీగా మారాయి.
ఎన్నికలు తెచ్చిన ఉపాధి
ఎన్నికలు తెచ్చిన ఉపాధి


