‘ఇందిరమ్మ’కు ఉపాధి అనుసంధానం
అవగాహన కల్పిస్తున్నాం
ఆలేరు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఇటీవల ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసింది. బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసింది. దీంతో లబ్ధిదారులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం చెల్లించే రూ.5లక్షల బిల్లు విషయంలో ఉపాధి హామీ పథకాన్ని భాగస్వామ్యం చేసింది. పాత నిబంధన ప్రకారం లబ్ధిదారులకు పునాది, బేస్మెట్ లెవల్ పూర్తయితే మొదటి విడతగా రూ.లక్ష, గోడలు స్లాబ్ లెవల్ వరకు అయితే రెండో దశగా మరో రూ.లక్ష, మూడో విడతలో స్లాబ్ పూర్తయితే రూ.2 లక్షలు, నాలుగో విడతగా ఇంటి నిర్మాణం పూర్తయితే రూ.లక్షతో కలిపి మొత్తం రూ.5లక్షలను లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది.
మారిన నిబంధనల ప్రకారం..
ఇందిరమ్మ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం మారిన నిబంధనల ప్రకారం లబ్ధిదారులు స్లాబ్ నిర్మాణం పూర్తిచేస్తే రూ.1.40 లక్షలు చెల్లించనుంది. మరో రూ.60 వేలు ఉపాధి హామీ పథకం నుంచి చెల్లిస్తారు. దీనికి పట్టణాల్లో అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై), గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రధానమంత్రి గ్రామీణ యోజన(పీఎంజీవై)ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఉపాధి హామీ కింద ఇళ్ల నిర్మాణ పనులు చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఉపాధి పనులను మినహాయించి లబ్ధిదారుల ఖాతాల్లో ఇకపై నాలుగు విడతల్లో ప్రభుత్వం రూ.4.40 లక్షలను చెల్లించనుంది.
రూ.60 వేల చెల్లింపు ఇలా..
గ్రామీణ ప్రాంతాల్లో 90 పనిదినాలకు రోజుకు రూ.300 చొప్పున రూ.27 వేలతోపాటు రూ.12 వేలు వ్యక్తిగత మరుగుదొడ్లు పేరిట మొత్తం రూ.39 వేలు చెల్లించనున్నారు. మరో రూ.21 వేలు ప్రధామంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వస్తాయి. పట్టణాల్లో ఇయితే మొత్తం రూ.60 వేలు ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద చెల్లిస్తారు. జిల్లాకు 7,325 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 274 ఇందిరమ్మ ఇళ్లు పూర్తికాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు స్లాబ్ లెవల్ పూర్తయి రూ.2లక్షల చెల్లింపులు జరిగిన ఇళ్లకు ఉపాధి హామీ పనుల భాగస్వామ్యం లేదు. ఇలాంటి వాటికి తదుపరి చెల్లించే బిల్లుల్లో మళ్లీ పనులు చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మారిన నిబంధనలతో బిల్లులు ఎప్పుడు అందేది సందిగ్ధంగా మారిందని లబ్ధిదారులు వాపోతున్నారు.
బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు
ఒక్కో ఇంటికి రూ.5 లక్షలకు గాను నేరుగా ఇచ్చేది రూ.4.40 లక్షలే..
పట్టణ, గ్రామీణ ఆవాస్ యోజన
కింద రూ.60 వేలు
ఈ నిధులు ఉపాధి హామీ పథకం నుంచి చెల్లించాలని నిర్ణయం
జిల్లాలో ఇందిరమ్మ పథకం ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిబంధన ప్రకారం లబ్ధిదారులకు దశల వారీగా బిల్లుల చెల్లిస్తున్నాం. ఇంటి నిర్మాణాల్లో ఉపాధి హామీ పనుల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. లబ్ధిదారులందరూ ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టాలి.
– ఎం.శ్రీరాములు, హౌసింగ్ డీఈ


