అక్రిడిటేషన్‌ కార్డులకు 9 నుంచి దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

అక్రిడిటేషన్‌ కార్డులకు 9 నుంచి దరఖాస్తులు

Feb 8 2026 7:14 AM | Updated on Feb 8 2026 7:14 AM

అక్రి

అక్రిడిటేషన్‌ కార్డులకు 9 నుంచి దరఖాస్తులు

భువనగిరిటౌన్‌ : జర్నలిస్టులకు 2026–28 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్‌ కార్డుల జారీ కోసం ఈనెల 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్‌ కార్డుల కాల పరిమితి గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్‌ కార్డులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయి అక్రిడిటేషన్‌ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన జాబితాల్లో పేర్లున్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌ http://ipr.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు.

నేటి నుంచి యాప్‌

ద్వారా యూరియా

భువనగిరి టౌన్‌ : రైతులకు అవసరమైన యూరియాను నేటి నుంచి ఫర్టిలైజర్‌ యాప్‌లో బుక్‌ చేసుకుని ఆన్‌లైన్‌ విధానంలో పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి రమాణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టా భూ యజమానులు, నాన్‌ పట్టా రైతులు, కౌలు రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా స్మార్ట్‌ ఫోన్లలో ఫర్టిలైజర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని తమకు కేటాయించిన కోటా యూరియాను బుక్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులు తాము సాగుచేసే పంటల విస్తీర్ణం ఒకసారి నమోదు చేశాక మార్చేందుకు వీలు ఉండదని పేర్కొన్నారు. యువర్‌ బుకింగ్‌ 24 గంటల పాటు మాత్రమే ఆక్టివ్‌గా ఉంటుందని తెలిపారు. రైతులకు యూరియా బుకింగ్‌ విషయంలో ఇబ్బందులు ఎదురైతే స్థానిక ఏఈఓల సహాయాన్ని తీసుకోవాలని సూచించారు.

ఆకట్టుకున్న ‘కూచిపూడి’

భువనగిరి : మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు చెందిన నాట్య గురువు తొండపు భవాని శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాకారిణులు అక్షర, ఖ్యాతి, ప్రణవి, ధరణి, శాన్వి, నందిత, శివాని తదితరులు పాల్గొన్నారు.

పశువైద్య సిబ్బంది

అందుబాటులో ఉండాలి

గుండాల : పశువైద్య సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారి పి.జానయ్య సూచించారు. శనివారం ఆయన గుండాల పశు వైద్యశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఇటీవల మండలంలో పులి సంచరించిన నేపథ్యంలో మూగ జీవాలపై ఏమైనా దాడి చేసిందా అని సిబ్బందిని అడిగి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయనవెంట డాక్టర్‌ యాకూబ్‌, గోపాల మిత్ర గోవిందు, సిబ్బంది ఉన్నారు.

ఫ్యాషన్‌ డిజైనింగ్‌

విద్యార్థుల సందర్శన

భూదాన్‌పోచంపల్లి : ఇక్కత్‌ పరిశ్రమ తీరుతెన్నులను తెలుసుకునేందుకు శనివారం మధ్యప్రదేశ్‌లోని మాధవ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ గ్వాలియర్‌కు చెందిన 40 మంది ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్యార్థులు పోచంపల్లిని సందర్శించారు. టూరిజం పార్కును సందర్శించి అక్కడ మగ్గాలు, మగ్గాలపై తయారవుతున్న ఇక్కత్‌, చేనేత వస్త్రాల తయారీ విధానాలు, నూలు, వస్త్రోత్పత్తుల మార్కెటింగ్‌ విధానాలు, చేనేత డిజైన్‌లను పరిశీలించారు. స్టడీ టూర్‌లో భాగంగా చేనేతలకు అంతర్జాతీయంగా పేర్గాంచిన పోచంపల్లి క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చామని ఫ్యాకల్టీ అశ్విని తెలిపారు.

అక్రిడిటేషన్‌ కార్డులకు  9 నుంచి దరఖాస్తులు1
1/1

అక్రిడిటేషన్‌ కార్డులకు 9 నుంచి దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement